గోబెల్స్ ను మించిన వ్యూహంతో మురిసిపోతున్నారు!పదిమంది ఒకే తీరుగా వ్యూహాత్మకంగా చెబితే.. అబద్ధాన్ని కూడా నిజం అని నమ్మించగలరు.. అనేది ఒక సిద్ధాంతం. ఆవును అమ్మడానికి తీసుకువెళుతున్న అమాయకుడిని తారసపడిన నలుగురూ.. పనిగట్టుకుని చెప్పిన అబద్ధాలతో అతడు దానిని మేక అని అనుకున్న కథ కూడా మనలో చాలా మందికి తెలుసు. ఇలాంటిదే జర్మన్ నియంత హిట్లర్ అనుచరుడు, మంత్రి గోబెల్స్ అనుసరించిన వ్యూహం. ఒకే అబద్ధాన్ని పదేపదే అనడం ద్వారా నిజం అనే భ్రమను ప్రజలకు కల్పించడం. ఆ గోబెల్స్ సిద్ధాంతాన్ని వైసీపీ మంత్రులు మరింతగా ఇంప్రొవైజ్ చేస్తున్నారు. ఒకే అబద్ధం పదిమంది అనడం మాత్రమే కాదు.. పదిమార్లు అనడం ద్వారా జనాన్ని భ్రమల్లో ముంచాలని చూస్తున్నారు.
సుప్రీం కోర్టు కీలకమైన తీర్పు వెలురించింది. రాజధాని అమరావతికి సంబంధించి.. హైకోర్టు ఇచ్చిన తీర్పు లోని కొన్ని అంశాలపై స్టే ఇచ్చింది. ఈ విషయంలో వైసీపీ మురిసిపోవాల్సిన అంశం ఏమున్నదో అర్థం కావడం లేదు. కేవలం తాము విజయం సాధించినట్లుగా, తమ వాదన విజయం సాధించినట్లుగా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప.. వైసీపీ వారి మాటలు మరొకందుకు ఉపయోగపడేలా లేవు.
కేవలం నెలలోగా ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలి, ఆరునెలల్లోగా అమరావతిని అభివృద్ధి చేయాలి, టౌన్ ప్లానింగ్ స్కీమ్ లు పూర్తి చేయాలి, రోడ్లు అభివృద్ధి చేయాలి, రైతులకు ప్లాట్లు మూడు నెలల్లోగా అప్పగించాలి అనే అంశాల మీద మాత్రమే స్టే వచ్చింది. సుప్రీం కోర్టు తీర్పు మూడురాజధానులకు పచ్చజెండా ఇవ్వడం కానే కాదు.
మరో కోణంలో గమనించినప్పుడు.. ప్రభుత్వం బాధ్యతను మరింతగా గుర్తు చేసేది మాత్రమే. నెలలోగా, మూడు నెలల్లోగా చేయాలన్న తీర్పుపై స్టే అంటే అసలు చేయవద్దని కాదు.. అనే సంగతి వైసీపీ మంత్రులు అర్థం చేసుకోవాలి. పైగా హైకోర్టు తీర్పు ఈ ఏడాది మార్చి 3వ తేదీన వచ్చింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ప్రభుత్వం ఏమీ చేయలేదు కూడా. సాధారణంగా ఇలాంటి తీర్పు వస్తే చేయడానికి గడువు అడగాలి.. అలా అడిగితే కమిట్ అయిపోయినట్టు అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం సుప్రీం కు వెళ్లింది. ఇప్పుడు స్టేతో మురిసిపోతే కుదరదు. మరి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నదో సుప్రీం కు చెప్పాల్సి ఉంటుంది. దానిని తప్పించుకోలేరు. తదుపరి విచారణ జరిగే జనవరి 31 నాటికి ప్రభుత్వం అఫిడవిట్లు వేయాలి.
పైగా హైకోర్టును ఏం చేబోతున్నారు? అనే సుప్రీం ప్రశ్నలకు ప్రభుత్వ న్యాయవాదులు ఎంత తడబడ్డారో అందరూ గమనించారు. ఇవన్నీ కోర్టు గుర్తుంచుకోకుండా పోదు.
అయినా సరే గోబెల్స్ ప్రచారం సిద్ధాంతం అనుసరిస్తూ.. తాము గెలిచినట్టుగా టముకు వేసుకుంటూ వైసీపీ వారు మురిసిపోతున్నారు. ఇలాంటి ప్రచారం వల్ల అమరావతినుంచి విశాఖకు (మంత్రులు కొందరు చెబుతున్నట్టుగా) వారంలోనో, నెలలోనో, త్వరలోనో.. తరలిపోవడం జరగదు.గోబెల్స్ ను మించిన వ్యూహంతో మురిసిపోతున్నారు!
గోబెల్స్‌ను మించిన వ్యూహంతో మురిసిపోతున్నారు!
Wednesday, November 13, 2024