గులాబీ వెలుపలకు దారి చూసుకుంటున్న తీగల!

Saturday, January 18, 2025

గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒకవైపు దేశమంతా తెలంగాణ మోడల్ లో అభివృద్ధి చెందాలంటూ.. యాత్రలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. దాదాపుగా ప్రతిరోజూ.. మహారాష్ట్రకు చెందిన ఎవరో కొందరు నాయకులను పార్టీలో చేర్చుకుంటూ.. భారాస లో చేరడానికి దేశవ్యాప్తంగా నాయకులు వెల్లువెత్తుతున్నట్టుగా బిల్డప్ లు ఇస్తున్నారు. అయితే.. సొంతఇంటిలో సొంతనేతలు జారిపోతున్నారనే సంగతిని ఆయన గుర్తించలేకపోతున్నారు. నిజానికి మహారాష్ట్ర నుంచి తప్ప, మరెక్కడినుంచి కూడా నేతలు భారాసలో చేరుతున్న దాఖలాలు కనిపించడం లేదు. కాగా.. తెలంగాణలోని అనేకమంది భారాస నాయకులు ఇతర పార్టీల్లోకి, ప్రధానంగా కాంగ్రెసులోకి వలస వెళుతున్నారు. తాజాగా హైదరాబాదు నగర మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా.. కేసీఆర్ మీద తీవ్రమైన అసంతృప్తిని వెళ్లగక్కడం విశేషం.

తెలుగుదేశం పార్టీ నాయకుడు అయిన తీగల కృష్ణారెడ్డి.. గతంలో భారాస తీర్థం పుచ్చుకున్నారు. అయినప్పటికీ ఆయన రాజకీయ ప్రస్థానం సవ్యంగా సాగలేదు. 2018 ఎన్నికల్లో ఆయన మహేశ్వరం నుంచి పోటీచేయగా, కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. గెలిచిన సబితను కేసీఆర్ తన జట్టులో కలుపుకుని, ఆమెకు మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. దీంతో  మహేశ్వరం నియోజకవర్గంలో తీగల కృష్ణారెడ్డి ప్రాధాన్యం అడుగంటిపోయింది. సాక్షాత్తూ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో సొంత పార్టీలోనూ ఆయనను పట్టించుకునేవారు లేకుండాపోయారు. ఆయనకూడా ఇన్నాళ్లూ సైలెంట్ గానే ఉండిపోయారు.

తాజాగా మీడియా ముందుకు వచ్చిన తీగల.. వచ్చే ఎన్నికల్లో తనకు మహేశ్వరం టికెట్ ఇవ్వకుంటే గనుక.. భారాసను వీడనున్నట్టు స్పష్టం చేశారు. అధిష్ఠానం అనుసరిస్తున్న తీరు మీద తీవ్రమైన అసంతృప్తి వెళ్లగక్కారు. సబితను భారాసలో చేర్చుకుని కేసీఆర్ తప్పు చేశారని వ్యాఖ్యానించడం విశేషం. తన కోడలు జడ్పీ ఛైర్మన్ గా ఉన్నది గనుక.. ఒకే ఇంట్లో రెండు పదవులు కావాలా? అని ప్రశ్నిస్తున్నారని తీగల అనడాన్ని చూస్తే.. ఆయనకు టికెట్ ఇవ్వడానికి ఆల్రెడీ నిరాకరించడం కూడా అయిపోయిందని, ఆయన చెప్పినట్లుగా కారు దిగడానికి ముహూర్తం చూసుకోవడం ఒక్కటే మిగిలిందని అర్థమవుతోంది.

‘ఒకే కుటుంబంలో రెండు పదవులు కావాలా?’ అని అడిగిన తీరుమీద.. తాను కూడా ఎదురు విమర్శిస్తే బాగుండదని తీగల అనడం.. కేసీఆర్ కుటుంబం మొత్తం పదవులు అనుభవిస్తున్న తీరు మీద తిరుగుబాటులాగానే కనిపిస్తోంది. కేసీఆర్ లాగానే తెలంగాణ కోసం ఉద్యమించిన చాలామంది నాయకులు పార్టీని వీడడానికి సిద్ధమవుతున్నారని, కేసీఆర్ వారిని స్వయంగా పిలిపించి మాట్లాడకపోతే.. అందరూ ఎవరి దారి వారు చూసుకుంటారని అంటున్నారు. కాంగ్రెసులో చేరబోతున్నట్టుగా తీగల చెప్పలేదుగానీ, ఆయన చేరిక ఖాయం అని అందరూ అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles