గులాబీ నిఘా : తీగల ఓకే.. ఇంకా ఎవరెవరు?

Sunday, December 22, 2024

గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున హైదరాబాదు నగర మేయర్ గా సేవలందించి.. తర్వాత ఎమ్మెల్యే కూడా అయిన సీనియర్ నాయకుడు తీగల కృష్ణారెడ్డి ప్రస్తుతం భారాసలో ఉన్నారు. నామ్ కే వాస్తేగా ఆయన భారాసలో చెలామణీ అవుతున్నారే గానీ.. నిజానికి చాలా కాలంగా స్తబ్ధంగానే ఉండిపోయారు. తన నియోజకవర్గం నుంచి భారాస టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో.. తీగల కృష్ణారెడ్డి అనివార్యంగా పార్టీ మారడానికి నిర్ణయించుకున్నారు. ఆయన కాంగ్రెసులో చేరడానికి ఆ పార్టీ అగ్రనేతలతో మంతనాలు కూడా పూర్తి చేసినట్టు, తాను ఆశించిన సీటునుంచి టికెట్ దక్కేలా హామీ పొందినట్టుగా ప్రచారం జరుగుతోంది. తీగల కృష్ణారెడ్డి కాంగ్రెసులో చేరికకు సంబంధించి ఇంకా అధికారికంగా ముహూర్తం మాత్రమే ఖరారు కావాల్సి ఉంది.

అయితే తీగల కృష్ణారెడ్డి పార్టీ మారడాన్ని గులాబీ అధిష్ఠానం కూడా లైట్ తీసుకున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. పార్టీ మారడం తప్ప తీగలకు కూడా గత్యంతరం లేదు, ఆయన కోరినట్టుగా టికెట్ ఇవ్వడానికి బారాసకు కూడా అవకాశం లేదు. తీగల కాంగ్రెసులో చేరడాన్ని వారు పట్టించుకోవడం లేదు గానీ.. గులాబీ దళం నుంచి ఇంకా ఎవరెవరు  కాంగ్రెసులో చేరికలకు దృష్టి సారిస్తున్నారో తెలుసుకోవడానికి నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది.

తీగల కృష్ణారెడ్డి గతంలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీచేసి, కాంగ్రెసు అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. తదనంతర పరిణామాల్లో కాంగ్రెసు నుంచి భారాసలోకి ఫిరాయించిన 11 మంది ఎమ్మెల్యేలో సబిత కూడా ఉన్నారు. సబితకు కేసీఆర్ మంత్రిపదవి కూడా కట్టబెట్టారు. ఇక పార్టీలో ఆమె స్థానం సుస్థిరం అయిపోయింది. రాబోయే ఎన్నికల్లో సిటింగులు అందరికీ టికెట్లు అని కేసీఆర్ ఇప్పటికే పదేపదే ప్రకటించిన నేపథ్యంలో పెద్దగా వివాదాలు, ఆరోపణలు కూడా లేని సబితా ఇంద్రారెడ్డికి మహేశ్వరం టికెట్ కన్ఫర్మ్ అయినట్టే. ఈ పరిణామాలు తీగల కృష్ణారెడ్డి రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేశాయి. ఆయనేమో తనతోపాటు తన కోడలికి కూడా టికెట్ కావాలని కోరుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆయన కాంగ్రెసులో చేరడానికి నిర్ణయించుకున్న తర్వాత.. వారి కుటుంబానికి ఒకటే టికెట్ ఇస్తారా? రెండు టికెట్లు ఇస్తారా? అనేది క్లారిటీ రావడం లేదు!

తెలంగాణలో నాయకులు పార్టీలు మారే సీజన్ మొదలైపోయింది. ఇప్పటికే కొందరు భారాస నుంచి కాంగ్రెసులోకి జంప్ చేశారు. గులాబీ దళానికి కూడా అనేక నియోజకవర్గాల్లో అంతర్గత సమస్యలు, ముఠా కుమ్ములాటలు ఉన్నాయి. కాంగ్రెసు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్న తర్వాత.. ఆయా నియోజకవర్గాల్లో పాత నేతలతో సయోధ్యకు అధిష్ఠానం చేసిన ప్రయత్నాలు లేవు. ఆ వైరం ఇప్పటికీ అందరి మధ్య రగులుతూనే ఉంది. వారంతా కూడా పార్టీ మారాలని అనుకుంటుండగా, ఫస్ట్ ప్రయారిటీ కింద అందరికీ కాంగ్రెసు కనిపిస్తోంది. అందుకే గులాబీ అధిష్ఠానం.. ప్రత్యేకంగా నిఘా పెట్టి.. ఎవరెవరు కాంగ్రెసు వైపు చూస్తున్నారో గమనిస్తున్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles