వామపక్ష పార్టీలు తెలంగాణలో చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కుపోయి ఉన్నాయి. తెలంగాణకు సంబంధించినంత వరకు భారాసతో బంధానికి స్థానిక రాష్ట్ర నాయకులు కమిట్ అయిపోయి ఉన్నారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో వామపక్షాలు కాంగ్రెస్ సారథ్యంలోని కూటమిలో చాలా బలంగా తమ గళం వినిపిస్తున్నాయి. కూటమికి కాంగ్రెస్ మాత్రమే సారథ్యం వహించాలని కూడా గొంతెత్తుతున్నాయి.
అయితే రాష్ట్రం విషయానికి వస్తే.. భారాసతో ఉండడం వల్లన తమకు లాభం జరుగుతుందనేది వామపక్షాల కోరిక. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కేసీఆర్ వీరితో పొత్తు పెట్టుకున్నారు. వామపక్షాలు వారితో కలిసి పనిచేయడం వల్ల మాత్రమే భారాస గెలిచిందని వారు అంటున్నారు. ఆ ఎన్నిక సందర్భంగా సదరు పొత్తులు మునుగోడుకు మాత్రమే పరిమితం కాదని, అసెంబ్లీ ఎన్నికల్లోనూ, పార్లమెంటు ఎన్నికల్లోనూ కూడా కొనసాగుతాయని కేసీఆర్ చెప్పిన మాటలను తమ్మినేని వీరభద్రం గుర్తు చేస్తున్నారు. ఇప్పటిదాకా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పొత్తుల గురించి కేసీఆర్ ఇంకా తమతో చర్చించలేదని, అలాగని వ్యతిరేకంగా కూడా మాట్లాడలేదని అంటున్నారు.
జాతీయ రాజకీయాల్లో వామపక్షాల తీరును బట్టి.. రాష్ట్రంలో కూడా వారు కాంగ్రెస్ తో జట్టు కడతారేమోననే ప్రచారం ఒకవైపు ఉంది. దీనిని తమ్మినేని ఖండిస్తున్నారు. భారాసతోనే కలిసి పోటీచేయాలని వారు ఉబలాటపడుతున్నారు. అయితే మునుగోడు ఎన్నిక నాటికి, ఇవాళ్టికి భారాస తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి అనే సంగతి ఆయన మరచిపోతున్నారు.
అప్పట్లో తానే జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర విపక్ష కూటమిని నిర్మించగలనని, అందులో వామపక్షాలు కూడా ఉంటాయని కేసీఆర్ అనుకుంటూ ఉన్నారు. అందుకే వారితో పొత్తులు పార్లమెంటు ఎన్నికల వరకు కూడా కొనసాగుతాయని చెప్పారు. కానీ తర్వాత సీను మారింది. భారాసయేతర కూటమి కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పడింది. అందులో వామపక్షాలు కీలకంగా ఉన్నారు. ఇలాంటప్పుడు కేసీఆర్ రాష్ట్రంలో, అసెంబ్లీ ఎన్నికలకు వారిని దగ్గరకు చేరనిస్తారా? అనేది అర్థం కాని సంగతి. భారాస తమతో పొత్తు పెట్టుకోకపోతే గనుక.. సీపీఐ సీపీఎం కలిసి తమ బలం ఉన్న చోట విడిగా పోటీచేస్తాయే తప్ప.. కాంగ్రెసుతో కలవవు అని తమ్మినేని అంటున్నారు. వారు అందుకు సిద్ధపడడమే మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు.