గులాబీ తిరుగుబాటులకు రెండు లక్ష్యాలు!

Wednesday, January 22, 2025

ఎన్నికలలో బరిలోకి దిగే అభ్యర్థుల జాబితాలను ప్రకటించిన తర్వాత చెలరేగే అసంతృప్తులలో చాలామంది కొన్ని రోజులు తర్వాత సద్దుమణిగిపోతారు. కొందరు తమ అసంతృప్తిని కంటిన్యూ చేస్తూ పార్టీని వదిలి ఇతర దారులు వెతుక్కుంటారు. కానీ ఇప్పుడు తెలంగాణ భారత రాష్ట్ర సమితి వ్యవహారంలో చిత్రమైన పరిణామం కనిపిస్తోంది. అభ్యర్థుల జాబితా ప్రకటించిన దాదాపు వారం రోజుల తర్వాత కూడా నాయకుల అసంతృప్తులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. అయితే వీరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తీరులో వారికి రెండేసి లక్ష్యాలు  ఉన్నట్లుగా కనిపిస్తోంది. టికెట్ నిరాకరించడం వలన తాము ఊరికే కూర్చోకుండా.. అసంతృప్తిని బయటపెట్టి కాస్త నానాయాగీ చేసినట్లయితే రెండు రకాల ప్రయోజనాలలో ఏదో ఒకటి దక్కవచ్చునని వారు ఆశిస్తున్నట్లుగా ఉంది.

ఈ రెండు ప్రయోజనాలలో ఒకటి- గులాబీ దళపతి కేసీఆర్ తమను పిలిచి టికెట్ నిరాకరించినందుకు ప్రత్యామ్నాయంగా ఇంకేదైనా గౌరవప్రదమైన పదవిని కట్టబెట్టడం. రెండు- తాము పార్టీ పట్ల అసంతృప్తితో వేగిపోతున్న సంగతిని గుర్తించి కాంగ్రెస్ పార్టీ తమను ఆహ్వానించి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం!

కెసిఆర్ అసంతృప్తులను బుజ్జగించే చర్యలలో భాగంగా పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవిని, చెన్నమనేని రమేష్ కు క్యాబినెట్ హోదాతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిని చాలా గౌరవంగా కట్టబెట్టారు. అదే సమయంలో మిగిలిన నాయకులలో అసంతృప్తులు ఎవరినీ పట్టించుకోలేదు. ఆ మాటకొస్తే మిగిలిన వారిలో తమ అసంతృప్తిని పూర్తిస్థాయిలో బయటపెట్టిన వారు కూడా తక్కువ. మళ్లీ గులాబీ పార్టీనే గెలుస్తుందేమోనని శంకతో చాలామంది గుంభనంగా ఉండిపోయారు. అయితే మహేందర్ రెడ్డి, రమేష్ లకు లభించిన వరాలు వారందరికీ స్ఫూర్తిని ఇచ్చాయి.

తాము కూడా రోడ్డున పడి గోల చేస్తే తను కూడా ఏదో ఒక పదవి దక్కుతుందని వారు ఆశిస్తున్నారు. టికెట్లు నిరాకరించబడిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య త్వరలోనే అభిమానులకు రుచికరమైన ఒక పరిణామం జరుగుతుందని అన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పది రోజుల వరకు నిరీక్షిస్తానని తనకు ఎందుకు టికెట్ నిరాకరించారో కేసీఆర్ వివరణ చెప్పాలని ఒక సవాలు విసిరారు. టికెట్లు దక్కని ఇతర నాయకులు కూడా తమ తమ స్థాయిల్లో ఏదో ఒక తాయిలం దక్కుతుందని  అధినేత వైపు ఎదురుచూస్తున్నట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అసంతృప్తిని బయటపెడుతున్న వారి రెండో లక్ష్యం- తమను కాంగ్రెస్ ఆహ్వానిస్తుందనే ఆశ. ప్రస్తుతానికి గులాబీ తిరస్కృతుల్లో రేఖా నాయక్ ఒకరే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లుగా బహిరంగంగా ప్రకటించారు. మిగిలిన నాయకులు అంతగా స్పష్టత ఇవ్వలేదు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పిలుపు వస్తుందని ఆ పార్టీలో చేరవచ్చునని నమ్మకంతోనే ప్రస్తుతం తిరుగుబాటు బావుటా ఎగరేసినట్లుగా కనిపిస్తుంది. నిజానికి భేతి సుభాష్ రెడ్డికి టికెట్ దక్కకపోవచ్చు అనే ప్రచారం చాలా కాలం ముందు నుంచే ఉంది. ఇక్కడ ఆయనను తప్పించి బొంతు రామ్మోహన్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని మొన్న మొన్నటిదాకా పార్టీలో అంతా అనుకున్నారు. బొంతు రామ్మోహన్ ఒకరకంగా ఎన్నికల ప్రచారం కూడా మొదలెట్టేశారు. అయితే బండారు లక్ష్మారెడ్డి పేరు చర్చల్లోకి వచ్చిన తర్వాత అప్పటిదాకా రామ్మోహన్ ను కూడా విభేదించిన సుభాష్ రెడ్డి రూటు మార్చారు. ఈ ఇద్దరు నాయకులు కలిసి కల్వకుంట్ల కవిత వద్దకు వెళ్లి తమ ఇద్దరిలో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని ఆమెకు విన్నవించుకున్నారు. తామిద్దరం కాకుండా మూడో వ్యక్తిని తీసుకువచ్చి తమ నియోజకవర్గం మీద రుద్దవద్దని కూడా చెప్పుకున్నారు. వీరి వేడికోళ్లు ఫలించలేదు. వీరిద్దరూ కాకుండా కేసీఆర్ బండారు లక్ష్మారెడ్డి కి టికెట్ ఇచ్చారు.

తనకు ఎందుకు టికెట్ నిరాకరించారో.. బండారు లక్ష్మారెడ్డికి ఎందుకు ఇచ్చారో.. కేసిఆర్ చెప్పాలని బేతి సుభాష్ రెడ్డి డిమాండ్ చేస్తున్న తీరు గమనిస్తే ఆయన పార్టీని వీడిపోవడానికి నిశ్చయించుకున్నట్లుగా కనిపిస్తోంది. మరి వీరందరికీ ప్రత్యామ్నాయంగా  కనిపిస్తున్న కాంగ్రెస్ ఏ మేరకు అవకాశం ఇస్తుందో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles