నవతరం రాజకీయాలు కప్పలతక్కెడలాగా మారిపోయాయి. అధికారం ఎక్కడ ఉంటే వారి పంచన చేరడానికి.. వారి చెంత చేరి, అధికారం ఉన్నన్నాళ్లు తమ పబ్బం గడుపుకుంటూ రాజకీయం చేయడానికి.. అవసరం తీరిపోతే మళ్లీ పార్టీ మారడానికి.. ఇవాళ్టి రోజుల్లో నాయకులు ఎవరూ సిగ్గుపడడం లేదు. తమను గెలిపించిన పార్టీతో సిద్ధాంతపరమైన విభేదాలు, ఇతరత్రా తీవ్రమైన తగాదాలు ఏర్పడినప్పుడు పార్టీ ఫిరాయించి మరొక పార్టీని ఆశ్రయించడం సహజం. అయితే కేవలం అధికార పార్టీ ప్రాపకం కోసం ఆరాటపడుతూ, గెలిపించిన పార్టీని వదిలిపోయే వాళ్ళు కూడా చాలామంది తయారవుతుంటారు. ప్రస్తుత తెలంగాణ రాజకీయాలను పరిశీలించినప్పుడు అలాంటి జంప్ జిలానీలలో కొందరి పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తయారైనట్లు కనిపిస్తోంది.
2018 ఎన్నికల తర్వాత తమను గెలిపించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను విడిచిపెట్టి భారాస తీర్థం పుచ్చుకున్న అనేకమంది ఎమ్మెల్యేలలో కొందరికి ఇప్పుడు టికెట్ గ్యారెంటీ లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారి పరిస్థితి త్రిశంకు స్వర్గంలో పడ్డట్టుగా అయింది. స్థానికంగా భారాస పాత నాయకులే బలంగా ఉండడం, ఫిరాయించి వచ్చిన పలువురికి ప్రజల్లో మంచి పేరు లేకపోవడం వల్ల కేసీఆర్ వారిని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు తెరాస తీర్ధం పుచ్చుకున్నారు. కేసీఆర్ వారిలో కొందరికి మంత్రి పదవులను కూడా కట్టబెట్టారు. అప్పట్లో వారందరికీ కూడా, తర్వాతి ఎన్నికలలో టికెట్ గ్యారెంటీ ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ మాట నమ్ముకుని వారు ఇన్నాళ్లుగా గులాబీ రాజకీయాలను చేస్తున్నారు. అయితే ప్రస్తుతం భారాస తమ అభ్యర్థుల జాబితాను ఫైనలైజ్ చేసే ప్రయత్నాలలో ఉంది. మరో రెండు మూడు రోజుల్లో తొలి జాబితాను వెల్లడించబోతున్నారు. ఇలాంటి సమయంలో వలస వచ్చిన ఎమ్మెల్యేలలో కొందరికి చేదు అనుభవం తప్పదనే ప్రచారం జరుగుతోంది.
2018లో ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత, సొంత పార్టీని వంచించి భారాసలో చేరిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి వెనక్కు తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని సమాచారం. వీరిలో కొందరు తమకు గులాబీ టికెట్ దక్కదనే సంగతి అర్థం అయిన తర్వాత కొన్ని నెలల కిందటే కాంగ్రెస్ నాయకులను పునరాగమనంకోసం సంప్రదించారని అయితే అధినాయకత్వం వారి తిరస్కరించిందని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి, తెలుగుదేశం నుంచి ఫిరాయించిన వారు ఇప్పుడు భారాస కూడా టికెట్ నిరాకరిస్తే గనుక వేరే గతిలేక బిజెపి వైపు వెళ్లే అవకాశం ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. గెలిపించిన పార్టీని వీడిపోయినందుకు వారికి తగిన శాస్తి జరిగిందని అంటున్న వారు కూడా ఉన్నారు.