గులాబీదళంతో ఈడీ మైండ్ గేమ్!

Wednesday, January 22, 2025

భారతీయ జనతా పార్టీని ఓ ఆట ఆడుకోవడానికి కవితక్క అరెస్టును అస్త్రంగా వాడుకోవాలని భారాస సంకల్పించింది. శనివారం నాటి పరిణామాలన్నీ వారి వ్యూహాన్నే తలపించాయి. ఢిల్లీ మొత్తం గులాబీ మయం అయింది. గులాబీ పార్టీ నాయకులు, శ్రేణులు అంతా అక్కడ మోహరించారు. స్వయంగా కేసీఆర్ కూడా వెళ్లేవారేనేమో.. కాకపోతే.. బిడ్డమీద మమకారంతో రాజకీయం చేస్తున్నారనే అపప్రధను మూటగట్టుకోకుండా.. కాస్త సంకోచించి వెనక్కు తగ్గారు. కేసీఆర్ తరఫున కేటీఆర్, హరీష్ రావు, ఇతర ముఖ్యనాయకులు పలువురు ఢిల్లీలో కొలువు తీరి కవితక్క అరెస్టు కాబోయే తీరును గమనించడానికి ఉద్యుక్తులయ్యారు. ఈడీ విచారణను ఎలా ఎదుర్కోవాలో వారందరూ కలిసి, భారాస న్యాయనిపుణుల సహా అర్ధరాత్రి వరకు ఆమెకు శిక్షణ ఇచ్చారు. అరెస్టు జరిగిన వెంటనే.. దానిని దేశవ్యాప్త ఉద్యమంగా మలచడానికి వందిమాగధ చిన్నాచితకా పార్టీల సహా సర్వం సన్నద్ధం చేసుకున్నారు. సరిగ్గా అక్కడే ఈడీ వారితో మైండ్ గేమ్ ఆడింది.
సాయంత్రానికి ఈడీ విచారణ నుంచి కవిత ఎలాంటి అరెస్టు లేకుండా బయటకు వచ్చారు. ఆమె అరెస్టు కాకపోయే సరికి గులాబీ శ్రేణులంతా పండగ చేసుకున్నారు. వారి ఉత్సాహానికి అంతూ పొంతూ లేదు.
కానీ వారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఆడిన మైండ్ గేమ్ లో చిక్కుకున్నట్టుగా బహుశా గ్రహించి ఉండరు. స్వయంగా కేసీఆర్ కూడా.. ‘కవితను అరెస్టు చేస్తారు. చేసుకుంటే చేసుకోనివ్వండి’ అని బహిరంగంగా ప్రకటించిన తర్వాత.. ఆమె అరెస్టు తథ్యం అని అందరూ నమ్మారు. అన్ని రకాల సంకేతాలు అందుకు వీలుగానే కనిపించాయి. అదే లిక్కర్ స్కామ్ లో ఇతర కీలక నిందితులు సిసోడియా, రామచంద్ర పిళ్లై లతో కలిపి ఆమెను విచారిస్తారని వార్తలు వచ్చాయి. ఒకే విచారణలో కవిత అరెస్టు వరకు తేలిపోతుందని ఊహించారు.
గులాబీ దళాలు అనకున్నట్లుగా (కోరుకున్నట్లుగా) కవిత అరెస్టు జరిగి ఉంటే.. చాలా గందరగోళమే అయ్యేది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీలైతే దేశంలో ఇతర ప్రాంతాల్లో చెదురుమదురుగా కూడా.. ఆందోళనలు ఉద్యమాలు చేయాలని ప్రిపేర్ అయిపోయారు. ఈడీ చల్లగా ఆమెను ఎనిమిది గంటలు విచారించి వదలిపెట్టింది. 16న మళ్లీ రమ్మని అంది. గులాబీ దళాలకు ఇది ఉత్సాహమే గానీ, రెచ్చిపోవాలనుకున్న వారు నిరాశపడి ఉంటారు.
ఇది ఈడీ వ్యూహం. రభస చేయడానికి గులాబీ దళం సన్నద్ధంగా ఉన్నప్పుడు వారు అరెస్టు చేయకుండా వదిలేశారు. ఇక్కడితో గులాబీ దళాల కిక్కు దిగిపోతుంది. రెండోసారి విచారణకు పిలిచేసరికి ఇంత ఓవరాక్షన్ హడావుడి ఉండవు. ఒకవేళ అప్పుడు కూడా కాకుండా మూడోసారి కూడా విచారణకు పిలిచారంటే ఆలోగా గులాబీ దళాలు.. ఇంత యాగీ చేయడంలో చల్లబడి పోయి ఉంటారు. అలాంటి సమయంలో ఈడీ అరెస్టు అస్త్రం తీయవచ్చుననేది అంచనా. శనివారం నాటి హడావుడి రెండో విడత, మూడోవిడత విచారణలకు ఉండదు గాక ఉండదు. ఇంకా గట్టిగా చెప్పాలంగే కవిత ఇంకా అరెస్టు కావడం లేదేమిటా అని గులాబీ దళాలు ఎదురుచూసినా చూడవచ్చు. ఆ దశ వచ్చాక అరెస్టు చేయడం వ్యూహంగా పలువురు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles