జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించడం ప్రారంభించి నాలుగేళ్లు గడుస్తుండగా ఆయన సహచర మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి ఇప్పుడే గుడ్డు పెట్టిందని ఆయన అన్నారు. ఆ గుడ్డు పొదగవలసిన అవసరం ఉన్నదని, అది మళ్లీ ఎదిగి పెట్ట కావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని ఆయన ఉత్రేక్షాలంకారంతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
కోడిగుడ్డు పెట్టిన తర్వాత పొదిగి పిగిలి పిల్ల బయటకు వస్తే అది కొంతకాలానికి ఎదిగి పెట్ట కావడంలో సందేహం లేదు. కానీ, గుడ్డు చేతికి రాగానే కొట్టి ఆమ్లెట్ వేసుకొని తినేసేవాళ్ళు సింహాసనం మీద కూర్చుని పరిపాలన సాగిస్తూ ఉంటే ఇక పెట్ట ఎలా వస్తుంది అనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. మంత్రిగారు ఒక సెటైరికల్ ఎగ్జాంపుల్ చెప్పి రాబోయే రోజుల్లో విపరీతమైన అభివృద్ధిని తాము రాష్ట్రానికి రుచి చూపించేస్తాం అన్నట్టుగా మాటలు చెబుతూ ఉంటే.. అదే సెటైర్ ఉదాహరణను ప్రభుత్వం మీదికే తిప్పికొడుతూ ప్రజలు ఇంకా దారుణంగా ఆడుకుంటున్నారు. ఆమ్లెట్ లవర్స్ ఉండే చోట గుడ్డు- పెట్ట ఎలా అవుతుంది అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటిదాకా సంక్షేమ పాలన పేరిట ప్రజలకు డబ్బు పంచిపెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప నిర్దిష్టంగా రాష్ట్రాన్ని సర్వతోముఖంగా ముందుకు తీసుకువెళ్లే అభివృద్ధి పనులు ఒక్కటి కూడా జరగడం లేదు. వచ్చే నెలలో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఆ సదస్సు ద్వారా మహాద్భుతమైన అభివృద్ధి జరగబోతోంది, రాబోయే రోజులన్నీ అభివృద్ధి బాటలో పరుగులు పెడతాయి అని చెప్పడం ఈ కోడిగుడ్డు ఉదాహరణ ద్వారా గుడివాడ అమర్నాథ్ లక్ష్యం కావచ్చు. కానీ కోడుగుడ్డు ఎగ్జాంపుల్ అంతగా పండలేదు. నాలుగేళ్లుగా పరిపాలన సాగిస్తూ ఉంటే ఇన్నేళ్ల తర్వాత కోడి తొలి గుడ్డు పెట్టడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పైగా ఈ కోడి గుడ్డు ఉదాహరణ ద్వారా గుడివాడ అమర్నాథ్ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా కూడా అయింది. ఎందుకంటే, ‘కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది’ అని అనడం ద్వారా.. “ఇన్నాళ్లు తమ ప్రభుత్వ పరిపాలనలో అభివృద్ధి ఏమీ జరగలేదు. ఇకమీదట జరిగే అవకాశం ఉంది.” అని ఆయన స్వయంగా ఒప్పుకుంటున్నట్లుగా కూడా ఉంది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు నేపథ్యంలో విలేకరుల ప్రశ్నలకు స్ట్రైట్ గా సమాధానం చెబితే సరిపోయే దానికి ఇలాంటి డొంక తిరుగుడు ఉదాహరణలతో గుడివాడ పార్టీ పరువు తీస్తున్నారా అనే చర్చ కూడా నడుస్తోంది.
గుడ్డు, పెట్ట అవుతుందా.. ఆమ్లెట్ అవుతుందా?
Sunday, January 19, 2025