వైఎస్ జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా తనకు మూడ్ వచ్చినప్పుడు.. అందరు ఎమ్మెల్యేలను, నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిలను పిలిచి సమీక్ష సమావేశం పెట్టేస్తారు. మీరందరూ చాలా శ్రద్ధగా గడపగడపకు కార్యక్రమంలో ఇంటింటికీ తిరగండి.. వచ్చే ఎన్నికల్లో మన పార్టీ ఖచ్చితంగా 175 సీట్లలో గెలిచిపోతుంది అని సందేశం ఇస్తారు. మీరు సరిగా గడపగడపకు తిరగడం లేదు.. ఇలాగైతే వేటు తప్పదు అని వారికి ఒక హెచ్చరిక కూడా జారీచేస్తారు. ఆనక లేచి చేతులు దులుపుకుని వెళ్లిపోతారు. కానీ క్షేత్రస్థాయిలో గడపగడపకు కార్యక్రమంలో ఉండే సాధక బాధకాలు ఏమిటో ఎమ్మెల్యేలకు కదా తెలుస్తుంది? వారి కష్టాలు ఎవరు వింటారు.. అని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
గడప గడపకు అనేది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి బుర్రలోనే పుట్టిన కార్యక్రమమో ఏమో గానీ.. దానికి ఆయన పూర్తిస్థాయి బ్రాండ్ అంబాసిడర్ లాగా వ్యవహరిస్తుంటారు. ఒక రకంగా చూసినప్పుడు.. ఈ కార్యక్రమం మీద ఆయన ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలు అందరినీ పోగేసి సమీక్ష సమావేశాలు నిర్వహించినంత చురుగ్గా ఇతర అభివృద్ధి పనుల విషయంలో కూడా వ్యవహరించి ఉంటే.. పోలవరం ప్రాజెక్టు కూడా ఎన్నడో పూర్తయిపోయి ఉండేదనే అభిప్రాయం కొందరికి ఉంది. సమీక్ష సమావేశాలు పెట్టే జగన్.. సచివాలయాల వారీగా మొక్కుబడి గణాంకాలను వివరిస్తూ.. అవే ఎమ్మెల్యేల పనితీరుకు కొలబద్ధలుగా మాట్లాడడం అనేది చాలా మందికి ఇబ్బంది కరంగా ఉంది.
గడపగడపకు కార్యక్రమంలో తిరగనంత మాత్రాన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఉంటారు. కానీ వారిని జగన్ పరిగణనలోకి తీసుకునేలా కనిపించడం లేదు. తాను తయారుచేసుకున్న తూకం రాళ్లతో మాత్రమే వారి ప్రతిభను తూకం వేస్తానని ఆయన అంటుంటారు. 25 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని, వారు గ్రాఫ్ పెంచుకోవాలని ఆయన చిన్న స్థాయి బెదిరింపులు కూడా చేస్తుంటారు. ఇదివరకు ఈ సంఖ్య ఇంకాస్త ఎక్కువ చెప్పేవారు. ఇప్పుడు కాస్త టోన్ తగ్గించారు. నలుగురు ఎమ్మెల్యేల తిరుగుబాటు, పార్టీనుంచి వారి సస్పెన్షన్ తర్వాత.. కాస్త మితవాద వైఖరి అవలంబిస్తున్నారు.
అయితే ఎమ్మెల్యేల బాధ ఇంకోరకంగా ఉంది. గుడ్డు పెట్టే కోడికే నొప్పి తెలుస్తుందని.. గడపగడపకు కార్యక్రమంలో ఇంటింటికి తిరిగే తమకే సాధకబాదకాలు తెలస్తాయని వారు అంటున్నారు. ప్రజలు తమను అనేక సమస్యలపై నిలదీస్తున్నారని, ఇంటింటికీ డబ్బు పంచిపెడుతున్నాం గనుక.. ప్రజలు ఏమీ మాట్లాడరు అనుకోవడం భ్రమ అని వారు బాధపడుతున్నారు. అయితే జగన్ వారి అభిప్రాయాలు అడగడం లేదు, చెప్పుకునే చాన్స్ కూడా ఇవ్వడం లేదు. సమీక్ష సమావేశం పేరుతో.. తానొక్కడే మాట్లాడుతూ.. ప్రెస్ మీట్ లాగానే తాను చెప్పదలచుకున్నది చెప్పేసి అక్కడితో ముగించడం అనేది కొందరు ఎమ్మెల్యేలను బాధిస్తోంది.
గుడ్డుపెట్టే కోడికే కదా నొప్పి తెలుస్తుంది!
Thursday, November 14, 2024