కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి, గనుల వ్యాపారి, అక్రమ మైనింగ్ దందాలకు పడిన శిక్షలతో ఏళ్లతరబడి జైల్లో గడిపి వచ్చిన గాలి జనార్దనరెడ్డి కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతున్నారు. కల్యాణ్ రాజ్య ప్రగతి పక్ష (కెఆర్‌పీపీ) పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది జరిగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీచేస్తుందని కూడా ఆయన వెల్లడించారు. గాలి జనార్దన రెడ్డి సొంత పార్టీ పెట్టడానికి తీసుకున్న నిర్ణయాన్ని గమనిస్తే.. అక్రమ వ్యాపార దందాలు, నేరమయ సామ్రాజ్యంలో ఘనాపాటీలుగా మారిపోయిన వారు.. ఒక దశకు చేరిన తర్వాత రాజకీయాన్ని కవచంగా వాడుకుంటున్నారా? అనే అభిప్రాయం కలుగుతోంది.
గాలి జనార్దనరెడ్డి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆ పార్టీలో ఆయన బళ్లారి జిల్లా అధ్యక్షుడుగా కూడా గతంలో పనిచేశారు. ఆ పార్టీనుంచే మంత్రిగా కూడా సేవలందించారు. బళ్లారి, ఓబుళాపురం మైనింగ్ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తిన తర్వాత.. పార్టీలో కాస్త ప్రాధాన్యం తగ్గింది. ఆరోపణలు రుజువు కావడంతో ఆయన జైలు శిక్షను కూడా అనుభవించారు. రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో అధికారంలోకి కూడా వచ్చింది.
అయితే గాలి జనార్దనరెడ్డి మాత్రం.. తాను ఒకప్పుడు అండగా నిలబడిన పార్టీ ఇప్పుడు తనను పట్టించుకోవడంలోదనే ఉక్రోషం గాలిలో ఉన్నట్టుంది. అందుకే ఆయన తనే సొంతంగా ఒక పార్టీ పెట్టేయదలచుకున్నారు. నేరమయ వ్యాపార సామ్రాజ్యానికి, అక్రమ మైనింగ్ లకు చిరునామా అయిన గాలి జనార్దనరెడ్డి తనే సొంత పార్టీ పెట్టేయాలనే నిర్ణయమే ప్రజాస్వామ్యానికి అపహాస్యం లాంటిదనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. గతంలో ప్రజాస్వామ్యం రాజకీయాల మీద చాలా జోకులు వినిపిస్తుండేవి. రౌడీలు అక్రమాలకు పాల్పడేవాళ్లు.. రాజకీయ నాయకులకు మద్దతిస్తుంటారనేది ఒక దశ. వాళ్లే రాజకీయాల్లోకి వచ్చి నాయకులు అవుతున్నారనేది తర్వాతి దశ. వాళ్లే సొంతంగా రాజకీయ పార్టీనే పెట్టేసి శాసించాలని అనుకోవడం మూడోదశగా కనిపిస్తోంది.
ఎందుకంటే.. గాలి జనార్దనరెడ్డి పార్టీనే గనుక ఏకంగా అధికారంలోకి రావడమే జరిగితే.. ఆ రాష్ట్రంలో చట్టాలను, శాసనాలను అన్నింటినీ గాలి నిర్ణయిస్తాడు. తాను చేసే పనులు ఏవేవైతే అక్రమాలుగా ఇప్పటిదాకా చట్టాల పరిధిలో ఉన్నాయో.. అలాంటివన్నీ సక్రమాలే అని.. దానికి తగ్గట్టుగా ఆయన చట్టాలను మార్చేసినా అడిగే దిక్కులేదు.
పార్టీ ని ప్రకటించిన సందర్భంలో ప్రతి నాయకుడు కూడా అనేకానేక నీతులు, విలువలు ప్రవచిస్తారు. కులమత ప్రాంత స్త్రీపురుష భేదాలు కూడా లేని సమాజాన్ని నిర్మించాలనే బవసణ్ణ తత్వ సిద్ధాంత స్ఫూర్తితో పార్టీ ప్రారంభిస్తున్నట్లు గాలి జనార్దనరెడ్డి ప్రకటించారు. ధనవనరులు పుష్కలంగా ఉన్నాయి గనుక.. తన పార్టీ తరఫున కొన్ని సీట్లు గెలిచినా.. ప్రభుత్వాన్ని డిసైడ్ చేసే స్థాయి వస్తే చాలుననేది ఆయన కోరిక కావొచ్చు. అలాగే తన పార్టీలో భార్య కూడా క్రియాశీలక పాత్రపోషిస్తుందని ప్రారంభంలోనే చెప్పడం విశేషం. మళ్లీ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే.. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఆయన ప్రారంభానికి ముందే చూసుకోవడం విశేషం.
గాలి పార్టీ : అక్రమాలకు కవచమే రాజకీయమా?
Sunday, December 22, 2024