గవర్నరుకు మొరపెట్టుకున్నా.. ఫలితం సున్నా!

Friday, November 15, 2024

నెలమొత్తం వాళ్లు కొలువు చేస్తారు.. నెలగడవగానే బత్తెం మాత్రం పడదు. పనిచేసేసి.. వేతనం కోసం అలా ఎదురుచూస్తూ గడపాలి. ఈలోగా అప్పుల వాళ్లు ఫోన్లు చేసి పలకరిస్తుంటారు.. బ్యాంకు ఈఎంఐలు గడువు మీరిపోతుంటాయి. చెక్ బౌన్స్ చార్జీలు పడుతుంటాయి. అయినా వాళ్లు నిస్సహాయులు ఏమీ చేయలేరు. జీతం కోసం ఎదురుచూస్తూ బతుకుతూ ఉంటారు.. ఇదీ ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితి. ఆరోతేదీ గడచిపోయినా కూడా రాష్ట్రంలో 60 శాతం మంది ఉద్యోగులకు ఇంకా జీతాలే రాలేదంటే ఎడ్మినిస్ట్రేషన్ ఎంత ఘోరంగా ఉందో.. ఆర్థిక పరిస్థితుల గురించి ప్రభుత్వం ఎంతగా బుకాయిస్తూ రోజులు నెడుతున్నదో మనకు అర్థం అవుతుంది.
ఉద్యోగులు అందరూ కలసికట్టుగా రాష్ట్ర గవర్నరు వద్దకు వెళ్లి మొర పెట్టుకున్నారు. తమ సుదీర్ఘ ఉద్యోగ జీవితాల్లో ఇంత దారుణమైన పరిస్థితులను ఎన్నడూ చూసి ఎరగలేదని వారు విన్నవించుకున్నారు. సమయానికి జీతాలు ఒక క్రమపద్ధతిలో రాకపోవడం వలన తమ జీవితాలు అనేక రకాలుగా అస్తవ్యస్తం అయిపోతున్నాయని కూడా మొరపెట్టుకున్నారు. ప్రతినెలా ఒకటోతేదీనే జీతాలు పడేలాగా ఒక చట్టం రావాలని, అలాంటి చట్టం తీసుకురావడానికి తమరే పూనుకోవాలని గవర్నరుకు విన్నవించుకున్నారు.
తమకు జీతాలు సక్రమంగా రావడం లేదని ఉద్యోగులు గవర్నరు వద్దకు వెళ్లి విన్నపాలు చేసుకోవడం అనేది దేశచరిత్రలోనే ప్రప్రథమం. ఈ వ్యవహారం జగన్ ప్రభుత్వం పరువు తీసింది. దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశం అయింది. అయితే ప్రభుత్వానికి ఇంత పొడవున కోపం పొడుచుకొచ్చింది. ఠాట్.. మామీద గవర్నరుకు పితూరీలు చెబుతారా? అంటూ ఆగ్రహించారు. అలాంటి ఉద్యోగ సంఘ ప్రతినిధుల మీద మంత్రులు కారాలు మిరియాలు నూరారు. వారికి నోటీసులు సర్వ్ చేశారు.
కానీ వారికి మాత్రం ఫలితం ఏం దక్కింది? గవర్నరుకు మొర పెట్టుకున్నంత మాత్రాన ఏం ఒరిగింది. ఆరోతేదీ గడచిపోయినా కూడా జీతాలు మాత్రం రాలేదు. మామీదే పితూరీలు చెబుతారా? అని ప్రభుత్వం పగబట్టినట్టుగా వ్యవహరిస్తోందా? అని కూడా అనిపిస్తోంది.
టీచర్లలో అయితే దాదాపుగా రాష్ట్రంలో ఎవ్వరికీ జీతాలు పడలేదని వార్తలు వస్తున్నాయి. పీఆర్సీ ఉద్యమాల తర్వాత కూడా టీచర్లు వెనక్కు తగ్గకపోవడంతో ఆ వర్గం మీదనే ప్రభుత్వం కక్షకట్టిందనే ప్రచారం చాలానే ఉంది. చివరకు టీచర్లను ఎన్నికల విధుల్లో కూడా పాల్గొననివ్వకుండా వారికోసం జగన్ సర్కారు ఒక ప్రత్యేక జీవో తీసుకువచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఆ వర్గంలో ఒక్కిరికీ ఇంకా జీతాలు పడలేదని వార్తలు వస్తున్నాయి.
ప్రభుత్వం మహా అయితే జీతాలు ఇవ్వడాన్ని ఆలస్యం చేయడం ద్వారా వారి జీవితాలతో పాక్షికంగా ఆడుకోగలదు. ఉద్యోగుల పరువు పోయే పరిస్థితులను కల్పించగలదు. అంతే తప్ప.. అసలు జీతాలు ఇవ్వకుండా ఉండడం సాధ్యం కాదు కదా. ఆ మాత్రం దానికి ఈ అపకీర్తి మూటగట్టుకోవడం ఎందుకు అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles