ప్రజలకు మూడు రాజధానులు మాత్రమే కావాలి.. అందరూ వికేంద్రీకరణను మాత్రమే కోరుకుంటున్నారు.. అనే వాదనతో కర్నూలులో సీమగర్జన అనే సభ నిర్వహిస్తున్నారు. మూడు రాజధానులకోసం ఉత్తరాంధ్రలో కొన్ని కార్యక్రమాలు జరిగాయి. తిరుపతిలో కూడా సభ నిర్వహించారు. కర్నూలులో కూడా నిర్వహించకపోతే పార్టీ అధినేత దృష్టిలో పలుచన అవుతామనే భయంతోనే సీమగర్జన సభను నిర్వహిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కాకపోతే.. గర్జన సభ వైసీపీ నాయకుల్లో మరింత గుబులు రేపుతోంది. గర్జన ద్వారా తమ పరువు మరింత పోతుందా? అనే భయం వెన్నాడుతోంది.
ఎందుకంటే.. మూడు రాజధానులు కావాలనే తరహా డిమాండ్ లను వినిపించేప్పుడు.. పార్టీ ఎటూ ఆ విధానం తీసుకున్నది గనుక.. పార్టీ కార్యకర్తలతో సభ నిర్వహించడం వల్ల ఉపయోగం ఉండదు. పార్టీ రహితంగా ఇతర పార్టీ నాయకులు కూడా కొందరైనా సరే.. కార్యక్రమానికి హాజరైతేనే వారి వాదనకు విలువ. కానీ.. వైసీపీ తప్ప మరే పార్టీ కూడా మూడు రాజధానులకు అనుకూలంగా లేదు. అదొక భయం వారిలో వెన్నాడుతోంది. పోనీ.. పార్టీలకు రాజకీయ ఉద్దేశాలు ఆపాదించి ప్రచారం చేసుకుందాం.. కానీ కొంతమంది అయినా తటస్థులు వేదిక మీద ఉంటేనే బాగుంటుంది అని నిర్వాహకులు అనుకుంటున్నారు.
తటస్థుల్లో కూడా వైసీపీ నిర్వహిస్తున్న సీమగర్జన సభ పట్ల గౌరవం లేదు. దాంతో ఎవరికి వారు దూరంగానే ఉన్నారు. అలా జరిగితే పరువు నష్టం తప్పదు. కానీ వైసీపీ వారు తప్ప ఎవ్వరూ వచ్చేలా కూడా లేదు. ఎలాగో ఒకలా మేనేజ్ చేసి నాన్ వైసీపీ ముద్రతో కొందరినైనా సీమగర్జన వేదిక మీద ఉంచాలనేది వారి ఆరాటంగా ఉంది. సామాజిక కార్యకర్తల ముద్రతో తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతున్నది గానీ.. వారంతా ఒకే సామాజిక వర్గానికే చెందిన వారు కనిపిస్తున్నారు. పార్టీలోనూ ఒకే సామాజిక వర్గం నేతలు కనిపించి, తటస్థుల పేరిట అదే సామాజిక వర్గం నుంచి మరికొంత మందిని మాట్లాడించినంత మాత్రాన ఏమవుతుంది. పోయే పరువే తప్ప మరేం జరగదు. అందుకే వైసీపీ నాయకులు కంగారు పడుతున్నారు.
ఉత్తరాంధ్రలో కార్యక్రమాలు నిర్వహించినప్పుడు.. పరిస్థితి కొంత బెటర్ గా కనిపించింది. విశాఖకే రాజధాని వస్తున్నది గనుక.. అక్కడ పార్టీ వారే కాకుండా ఇతరులు కూడా పాల్గొన్నారు. కానీ కర్నూలులో హైకోర్టు అనే దాని మీద స్థానికంగా పెద్ద విలువ లేదు. పైగా న్యాయరాజధాని అనే బూటకపు పదాన్ని ప్రభుత్వం చెబుతున్నదే.. తప్ప.. విశాఖతో పోలిస్తే అభివృద్ధి చాలా ఘోరంగా ఉంటుందని అంతా నమ్ముతున్నారు. వైసీపీకి చిత్తశుద్ధి లేదని, కర్నూలు హైకోర్టు గురించి కేంద్రానికి విన్నవించకపోవడమే ఇందుకు నిదర్శనం అని అంటున్నారు. వికేంద్రీకరణ అనే బిల్లుకు లేటు కావొచ్చు గానీ.. కర్నూలులో హైకోర్టు బెంచ్ కావాలని కేంద్రాన్ని అడగడానికి అడ్డులేకపోయినా.. ప్రభుత్వంలో చొరవ కనపడడం లేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో సీమగర్జన కు వైసీపీ నేతలు సిద్ధం అవుతున్నారు.
గర్జన గుబులు : నాన్-వైసీపీ లేకుంటే పరువు నష్టం!
Friday, December 27, 2024