పవన్ కల్యాణ్ అభిమానులకు ఇది శుభవార్తే. కానీ, సీక్వెల్ అనగానే సినిమాకు సంబంధించిన వార్త అనుకుంటే కుదరదు. ఏడాది తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ సీక్వెల్ రాజకీయ ప్రకటన చేయబోతున్నారు. మరో మూడు రోజుల్లో జనసేన ఆవిర్భావి దినోత్సవ సభ భారీ స్థాయిలో జరగబోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయం ఉన్న సంక్లిష్ట దశలో.. ఈ వేదిక మీద నుంచి పవన్ కల్యాణ్ ఏ కీలక ప్రకటన చేయబోతున్నారు అనేది చాలా కీలకం. అయితే విశ్వసనీయ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి .. గత ఏడాది చేసిన ప్రకటనకు సీక్వెల్ మాత్రమే ఈ ఏడాది ప్రసంగంలో ఉంటుందని తెలుస్తోంది.
గత ఏడాది పార్టీ ఆవిర్భావ సభలోనే.. పవన్ కల్యాణ్ ప్రభుత్వ వ్యతిరక ఓటును చీలనివ్వను అనే కీలక ప్రకటన చేశారు. అలాంటి ప్రకటన చేయడం అదే తొలిసారి. అప్పటినుంచి ఏపీలో జనసేన రాజకీయ పొత్తుల గురించి అనేక రకాల ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. ఎటూ ఆయన భారతీయ జనతా పార్టీతో కూటమిబంధంలో ఉన్నారు గనుక.. ఎన్నికల సమయానికి తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు పెట్టుకుంటారని అంతా అనుకుంటున్నారు. మధ్యలో అనేక పరిణామాలు ఈ వాదనకు అనుకూలంగానే నడిచాయి. చంద్రబాబునాయుడు కుప్పంలో.. తనకు పవన్ కల్యాణ్ మీద వన్ సైడ్ లవ్ ఉందని చెప్పినా, విశాఖ లో పవన్ కల్యాణ్ నిర్బంధం తర్వాత.. చంద్రబాబు స్వయంగా వెళ్లి పరామర్శించినా, కుప్పంలో చంద్రబాబు నిర్బంధం తర్వాత పవన్ కల్యాణ్ వెళ్లి పరామర్శించినా అన్ని వ్యవహారాలు పొత్తు పొడసూపే సంకేతాలుగానే జరిగాయి. అయితే ఉభయుల వైపు నుంచి పొత్తుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.
ఎన్నికలు కేవలం ఇంకో ఏడాది దూరంలోనే ఉన్నాయి. ఇప్పటికి కూడా పొత్తుల విషయంలో క్లారిటీ లేకపోతే, ప్రజలకు స్పష్టత ఇవ్వకపోతే.. పార్టీ శ్రేణుల్లో స్పష్టత లేకపోతే చాలా విపరిణామాలు సంభవించే అవకాశం ఉంది. వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే మాట ఒక్కటే మిగులుతుంది తప్ప.. ఇంకా పొత్తుల సంగతి డిసైడ్ చేసుకోకపోతే నియోజకవర్గాల్లో ఎవరు కష్టపడి పనిచేయాలో తేలదు.. పొత్తుల ప్రకటన ఆలస్యం కావడం వలన.. ఇలా నియోజకవర్గ స్థాయి నాయకుల్లో తిరుగుబాట్లు అసంతృప్తులు ఆ రకంగా పార్టీకి జరిగే డేమేజి ఉంటుంది.
ఈ నేపథ్యంలో.. పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్భావ సభలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. గత ఏడాది చేసిన ‘వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అనే ప్రకటనకు సీక్వెల్ గా ఈసారి ప్రకటన ఉంటుందని అంతా అంటున్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కు అయి వక్ర రాజకీయం నడిపిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా పవన్ కల్యాణ్ ఈ ప్రసంగంలో కీలక విషయాలు వెల్లడిస్తారని పలువురు అంచనా వేస్తున్నారు.
గత ఏడాదికి సీక్వెల్ ప్రకటన చేయనున్న పవన్!
Monday, December 23, 2024