ఖాళీగా ఉన్న పోస్టు ఇస్తే పోయేదేముంది?

Wednesday, January 22, 2025

భారతీయ జనతా పార్టీ పరువు బజార్న పడింది. పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పార్టీని బజార్లో పెట్టారని ఇవాళ ఎవ్వరైనా విమర్శిస్తే గనుక, అందుకు కారణం పార్టీ అధిష్ఠానం పెద్దల వైఖరే అనే సంగతిని ముందుగా వారు తెలుసుకోవాలి. పార్టీకి రాష్ట్రంలో పరువు దక్కించిన కీలక నేత విషయంలో పార్టీ వ్యవహరిస్తున్న తీరు నిజంగానే గర్హనీయమైనది. రఘునందన్ రావు ఆరోపణలు ఎంత నిజాలు, ఎంత అతిశయోక్తులు అనే సంగతి తరువాత.. ఖాళీగా ఉన్న హోదాను, మరొకరికి ఇవ్వడానికి అవకాశం కూడా లేని హోదాను ఆయనకు కట్టబెడితే పోయేదేముంది? అనే ప్రశ్న ఈ వివాదాన్ని గమనిస్తున్న వారి మదిలో మెదలుతుంది.

రఘునందన్ రావు.. దుబ్బాకలో ఎమ్మెల్యేగా గెలిచేవరకు భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీలో ఉన్నది ఒకే ఒక్క ఎమ్మెల్యే.. రాజాసింగ్. ఆ రాజాసింగ్ కూడా.. తానొక్కడే ఒక శక్తి అనుకునే రకం. పార్టీతో నిమిత్తం లేకుండా తాను గెలుస్తాను అని చెప్పుకునే రకం. ఉన్నది ఒకడే ఎమ్మెల్యే.. ఆయనే ఫ్లోర్ లీడర్. అయితే దుబ్బాకనుంచి రఘునందన్ రావు గెలిచిన తర్వాత.. పార్టీ ఇమేజి మారింది. దుబ్బాక.. బిజెపికి సిటింగ్ సీటు కాదు. అలాంటిది అక్కడ రఘునందన్ ను ఓడించడానికి భారాస ఎంత గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఆయన మంచి మెజారిటీతో నెగ్గుకొచ్చిన వైనం పలువురికి ఆశ్చర్యం కలిగించింది. బిజెపికి రాష్ట్రంలో క్రేజ్ పెరిగింది.

అప్పటికే భారాసలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ దుబ్బాక విజయం తర్వాతనే బిజెపిలోకి వచ్చారు. తర్వాతి పరిణామాలలో రాజాసింగ్ ఫ్లోర్ లీడర్ పదవి పోయింది. అప్పటినుంచి బిజెపి ఫ్లోర్ లీడర్ పదవి ఖాళీగానే ఉంది. ఉన్నది ఇద్దరే. ఈటల రాజేందర్.. ఆ పదవిని ఆశించే స్థాయి నాయకుడు కాదు. తనకు ఇంకా పెద్ద హోదాలు దక్కాలని కోరుకుంటారు. అలాంటప్పుడు.. ఆ పదవి కావాలని అడుగుతున్న రఘునందన్ రావును పార్టీ ఎందుకు పట్టించుకోలేదు.. అనేది ఎవ్వరికీ అర్థంకాని సంగతి.

ఇప్పుడు రఘునందన్ రావు తన ఆవేదనను బహిరంగంగానే వ్యక్తం చేసేశారు. పార్టీకి ఏకంగా ఫత్వా జారీ చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి, అసెంబ్లీలో పార్టీ ఫ్లోర్ లీడర్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవుల్లో ఏదో ఒకటి ఇస్తే మాత్రమే పార్టీలో కొనసాగుతాను అని సంకేతాలు ఇచ్చారు. ఈ పదవులకు నేను అనర్హుడినా? ఖాళీగా ఉన్న పదవిని కూడా నాకు ఇవ్వరా? నడ్డా దృష్టికి తీసుకువెళ్తే ఆశ్చర్యపోయిన ఆయన ఆ తర్వాత ఏ చర్యలూ తీసుకోలేదు. ఆయన వైఖరి మీద కూడా మోడీకి ఫిర్యాదు చేస్తా అని రఘునందన్ అంటున్నారు. బిజెపి పరువు ఇవాళ ఇలా బజార్న పడ్డదంటే.. అది స్వయంకృతమే. ఖాళీగా ఉన్న పోస్టును కూడా ఇవ్వకుండా ఆయనను చిన్నచూపుచూసిన ఫలితమే ఇది అని విశ్లేషకులు భావిస్తున్నారు.  

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles