‘ప్రతిపక్షాలు అన్నీ కలిసిపోటీచేయాలి. అందరూ కలిసి భారతీయ జనతా పార్టీని ఓడించాలి. ఈ ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించే యోగ్యత మాత్రం కాంగ్రెస్ కే ఉంటుంది. అలా ఉంటుందని మిగతా వారు ఒప్పుకోవాలి’ ఇదీ.. ఏఐసీసీ సారథి మల్లికార్జున ఖర్గే వ్యక్తం చేసే అత్యాశ. కాంగ్రెస్ రాయపూర్ ప్లీనరీ సమావేశాల్లో ఆయన తన అభిలాషను చాలా స్పష్టంగా వ్యక్తం చేశారు. అంతలోనే ఆయన వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఆయన అత్యాశకు కాంగ్రెస్ తో జట్టుకట్టే అలవాటున్న ఇతర పార్టీలు కూడా పెద్ద సుముఖంగా లేవనే సత్యాన్ని గ్రహించాల్సి వచ్చింది. మళ్లీ కాస్త వెనక్కు తగ్గి మాట్లాడారు.
చెన్నైలో ముఖ్యమంత్రి స్టాలిన్ 70వ జన్మదినం జరిగింది. ఫరూక్ అబ్దుల్లా, మల్లికార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ లాంటి వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. వారి ప్రసంగాల్లో రాజకీయాంశాలే దొర్లాయి. కాంగ్రెస్ పార్టీ అత్యాశను ఫరూక్ అబ్దుల్లా తోసిపుచ్చారు.
‘‘ప్రధాని అభ్యర్థి గురించి మర్చిపోండి. ఎన్నికల్లో గెలవడం గురించి ఆలోచించండి. మనమంతా కలిసి పనిచేయాలి’’ అని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఆయన ఖర్గేని ఉద్దేశించే ఈ మాటలు అనడం విశేషం.
ఇదే కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే రాయ్‌పూర్ ప్రసంగానికి భిన్నంగా మాట మార్చాల్సి వచ్చింది. ‘ధాని అభ్యర్థి వరు? కూటమికి నాయకత్వం ఎవరిది అనే విషయం కాంగ్రెస్ ఎన్నడూ చెప్పలేదు. ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడాలని మాత్రమే కోరుకుంటోంది’ అని ఖర్గే అన్నారు. తన రాయపూర్ వ్యాఖ్యల పట్ల ఇతర ప్రతిపక్ష నాయకుల్లో విముఖతను గమనించి.. ఆయన ఈ రకంగా మాట మార్చారా అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.
మల్లికార్జున ఖర్గే సోనియా కుటుంబానికి విధేయుడు. కేవలం విధేయత కార్డు మీదనే చివరి నిమిషంలో రేసులోకివచ్చి ఏఐసీసీ అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు. అందుకు ప్రతిఫలంగా.. రాహుల్ ను ప్రధాని పీఠంమీద కూర్చోబెట్టాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. అయితే సుదీర్ఘానుభవం ఉన్న ఈ ఎనభయ్యేళ్ల కాంగ్రెస్ నాయకుడికి.. తన కళ్లెదురుగా యావత్తు కాంగ్రెస్ శ్రేణులు కనిపించేసరికి రాయపూర్ లో ఉత్సాహం తన్నుకొచ్చినట్టుంది. అందుకే విపక్ష కూటమికి కాంగ్రెస్ మాత్రమే సారథ్యం వహించగలదు అంటూ డైలాగులు కొట్టారు. అదే సమయంలో ఆయన స్టాలిన్ పుట్టినరోజు కార్యక్రమానికి వెళ్లి.. అక్కడ చుట్టూ విపక్ష నాయకులను గమనించేసరికి, వారి వారి రాష్ట్రాల్లో తమ పార్టీకంటె వారు చాలా బలవంతులు అనే సంగతి స్పృహలోకి వచ్చేసరికి మాట తడబడినట్టుంది. కాంగ్రెస్ మాత్రమే నాయకత్వం వహిస్తుందని తాను అనలేదు అంటూ దిద్దుకుంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోని అత్యాశకు ఆదిలోనే బ్రేకులు పడ్డాయి. వారు తమ వాస్తవమైన బలాన్ని గుర్తెరిగి ఆమేరకు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని ప్రజలు అనుకుంటున్నారు.
ఖర్గే అత్యాశకు అబ్దుల్లా బ్రేకులు!
Monday, December 23, 2024