భారాస ఆవిర్భావ సభ పేరుతో.. తన బలప్రదర్శనకు కేసీఆర్ ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగసభ విజయవంతం అయింది. తాను బలమైన నాయకుడిని అని, భారీగా సమీకరించిన జనం హాజరైన సభలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేసీఆర్ నిరూపించుకోగలిగారు. భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో తాను కీలకం కావాలని అనుకుంటే.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక నాయకుల మద్దతు తప్పనిసరి అయిన నేపథ్యంలో వారిని ఇంప్రెస్ చేయడంలో కేసీఆర్ కొంతవరకు కృతకృత్యులు అయినట్టే.
అయితే దీనికి తర్వాతి దశ ఏమిటి? భారాసను జాతీయ స్థాయిలో విస్తరించడానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేవన్నీ చర్చనీయాంశాలే.
వామపక్షాల విషయంలో వారి మద్దతు కూడగట్టడం పెద్ద విశేషం కాదు. ఎందుకంటే.. దేశంలో మోడీకి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా వారి జట్టులో నిలిచి మద్దతివ్వడానికి వారు రెడీగా ఉంటారు. అయితే ఈ బలప్రదర్శన ద్వారా కేసీఆర్ కోరుకుంటున్నట్టుగా కాంగ్రెస్ కూడా ఉండని మోడీ-ప్రత్యామ్నాయ కూటమి సాధ్యమవుతుందా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. వామపక్షాలు కాంగ్రెస్ ఏ పిలుపు ఇచ్చినా దానికి కూడా అనుకూలంగానే స్పందిస్తుంటారు.
అయితే ఈ బలప్రదర్శన ద్వారా కేసీఆర్ ఒక ఎడ్వాంటేజీ సాధించే అవకాశం ఉంది. మోడీ వ్యతిరేక భావజాలాన్ని కొన్ని సంవత్సరాలుగా చాలా బలంగా వినిపిస్తున్నప్పటికీ.. కేసీఆర్ జాతీయ స్థాయిలో అనేక మంది కీలక నాయకుల నమ్మకాన్ని పొందలేకపోయారన్నది నిజం.నమ్మక పోవడంతో పాటు రకరకాల కారణాల దృష్ట్యా మమతా బెనర్జీ, నితీశ్ కుమార్, స్టాలిన్ వంటి అనేకులు కేసీఆర్ వెంటనిలవడానికి ముందుకు రావడం లేదు. అయితే వీరందరి మద్దతును కూడగట్టడం అనేది అంత చిన్న విషయమూ కాదు, ఒక్కరోజులో అయిపోయేది కూడా కాదు.
ఈ నేపథ్యంలో ఖమ్మం సభ విజయవంతం కావడం, ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి రావడం అనేది కేసీఆర్ సాధించిన విజయం. ఇది ఒకటో మెట్టు మాత్రమే అనుకోవాలి. జాతీయ ప్రస్థానంలో రెండో మెట్టు కూడా తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు సభకు రాకుండాపోయిన జాతీయ నాయకులు కూడా కేసీఆర్ బలాన్ని గమనించి, ఆయనకు మద్దతివ్వడానికి ముందుకు వస్తే అప్పుడు .. ఖమ్మం సభ నిజంగా విజయవంతం అయినట్టు లెక్క. చిల్లరమల్లరగా రాష్ట్రానికి ఇద్దరు ముగ్గురను పార్టీలో చేర్చుకోవడంకాదు. నితీశ్, శరద్ పవార్, మమతా దీదీ వంటి వారి స్పందనేంటో చూశాకే.. ఖమ్మం సక్సెస్ ను కొలవడం సాధ్యమవుతుంది.
ఖమ్మం సక్సెస్‌కు సీక్వెల్ ఏమిటి?
Wednesday, January 22, 2025