2024 అసెంబ్లీ ఎన్నికలలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ అధికారంలోకి రానివ్వబోనని పదేపదే చెబుతున్న పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రలో భాగంగా ఇప్పుడు సరికొత్త ఆస్త్రాన్ని బయటకు తీశారు. జగన్ అంటే ఒక క్రిమినల్ అనే భావనను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఒక క్రిమినల్ రాజ్యంలో నేనుండలేను అనీ.. క్రిమినల్ ఎమ్మెల్యేలను ప్రోత్సహించే, క్రిమినల్ ఎమ్మెల్సీలను వెనకేసుకు వచ్చే ముఖ్యమంత్రి కూడా క్రిమినల్ అని రకరకాలుగా జగన్ మీద సూటి విమర్శలు చేస్తున్నారు జనసేనాని పవన్ కల్యాణ్!
జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు స్వాహా చేసినట్టుగా సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నప్పటికీ.. అవన్నీ కూడా.. కేవలం ఆర్థిక నేరాలు మాత్రమే. ఆ కేసుల్లో బెయిల్ మీద బయటకొచ్చిన జగన్, సీఎం అయ్యారు. కేసులు ఇంకా విచారణ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆయన మీద నేరుగా క్రిమినల్ కేసులు మాత్రం లేవు. ఇప్పటి దాకా తెలుగుదేశం పార్టీ కూడా జగన్ నేర చరిత్ర గురించి ఎంతగా వ్యాఖ్యానాలు చేసినా.. ఆయనను ఆర్థిక నేరగాడుగానే ప్రొజెక్టు చేస్తూ వచ్చింది. నిజానికి క్రిమినల్ నేరఘటనలతో ముడిపెట్టడం అనేది వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాతనే జరిగింది.
వైఎస్ వివేకా హత్య కేసు విచారణ విషయంలో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ఉపేక్ష ధోరణే ఆయన మీద నేరారోపణలు చేయడానికి విపక్షాలకు ఆస్కారం కలిగిస్తోందన్నది నిజం. ఎందుకంటే సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి.. తన సొంత బాబాయి దారుణమైన హత్యకు గురైతే ఆ కేసును ఇప్పటిదాకా తేల్చలేకపోతున్నారంటే.. అది అపరిమితమైన చేతగానితనం అయి ఉండాలి, లేదా ఆ హత్య వెనుక వాస్తవాలను బయటకు రానివ్వకూడదనే కోరిక అయినా ఉండాలి. జగన్ చేతగాని వాడు అని ఎవ్వరూ అనలేరు. అందుకే ఆయన మీద నేరారోపణలు పెరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా.. నర్మగర్భంగా నేరారోపణలు చేస్తుండగా పవన్ చాలా సూటిగా, క్రిమినల్ ముఖ్యమంత్రి అంటూ నిరసించడం చర్చనీయాంశం అవుతోంది.
జగన్ మీద విరుచుకుపడడంలో పవన్ కల్యాణ్ ఏమాత్రం తగ్గడం లేదు. గోదావరి జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే రాజ్యమేలుతున్న నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కూడా ఆయన ఏమాత్రం జంకడం లేదు. వారి మీదనే డైరక్ట్ ఎటాక్ కు దిగుతున్నారు. జగన్ క్రిమినల్ చరిత్రను ప్రతిచోటా ప్రధానంగా ప్రస్తావించడం ద్వారా.. జగన్ క్రిమినల్ అనే మాటను పదేపదే ఉపయోగించడం ద్వారా.. రాష్ట్ర ప్రజల ఆలోచనల్లో ఒక మార్పు తీసుకురావడం సాధ్యం అవుతుందని పవన్ కల్యాణ్ తలపోస్తున్నట్టుగా ఉంది. మరి ఆయన మాటల దూకుడు ఫలితం ఎలా ఉంటుందు చూడాలి.