జగన్మోహన్ రెడ్డి విజయం కోసం మేథోమధనం చేస్తున్న వ్యూహకర్తలు అందరూ ఇప్పుడు చాలా సీరియస్ గా పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన తొలి మేనిఫెస్టో ప్రజల్లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టో ప్రజల్లో ఎలాంటి స్పందన సాధిస్తున్నదనే విషయంలో తెలుగుదేశం కంటె.. వైఎస్సార్ కాంగ్రెస్ దళాలే చాలా శ్రద్ధగా ఆరాలు తీస్తూ, సర్వేలు చేస్తూ ఉన్నట్లు సమాచారం. వాలంటీర్ల ద్వారా.. చంద్రబాబు హామీలపై ప్రజల మనోగతం ఎలా ఉన్నదో తెలుసుకునే ప్రనయత్నం చేస్తున్నారు.
అదే సమయంలో, చంద్రబాబు హామీలకు విరుగుడుగా తాము ఎలాంటి హామీలు ఇవ్వాలి? ఎలా ప్రజలను ఆకట్టుకోవాలనే విషయంలో వ్యూహకర్తలంతా కసరత్తు చేస్తున్నారు. 18ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 వంతున అందించే ఆలోచనలను అదే రూపంలో గానీ, మరో రూపంలో గానీ తాము కూడా ఆచరిద్దామనే సాహసం జగన్ సర్కారుకు కలగడం లేదు. అందుకే జగన్ దళాలందరూ ఆ హామీని విపరీతంగా విమర్శిస్తున్నారు. కానీ ఇతరత్రా కొన్ని హామీల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించాలని అనుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా పంపిణీచేస్తామనే చంద్రబాబు హామీ పనిచేస్తుందనే అభిప్రాయం వైఎస్సార్ వ్యూహకర్తల్లో ఉంది. దానికి విరుగుడు ఆలోచిస్తున్నారు.
ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వడం అనేది కాకుండా, ఏకమొత్తంగా గ్యాస్ సిలిండర్ ధరపై కొంత రాయితీ ప్రకటిస్తే మరింత ఎక్కువమందిని ఆకట్టుకోవచ్చునని ఆలోచిస్తున్నారు. మూడు ఉచిత సిలిండర్లు కొందరికే అందుతాయని, అలాకాకుండా మొత్తం ప్రతి సిలిండర్ ధరమీద రాయితీ ప్రకటిస్తే లాభం అందరికీ వర్తిస్తుందని, ప్రతి కుటుంబాన్ని ఆకట్టుకోవచ్చునని.. ఆ రాయితీ మొత్తాన్ని గ్యాస్ కనెక్షన్ యజమాని ఖాతాలో వారు సిలిండర్ కొన్నప్పుడెల్లా జత చేసేలా ప్లాన్ చేయవచ్చునని అనుకుంటున్నారు.
రాజస్తాన్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఐడియాను కాపీ కొట్టడం గురించి కూడా జగన్ దళం యోచిస్తోంది. అక్కడ ఉజ్వల పథకం కింద గ్యాస్ పొందే లబ్ధిదారులు అందరికీ రాష్ట్రప్రభుత్వం భారీగా రాయితీ అందిస్తోంది. వారి ఖాతాల్లో జమ చేస్తోంది. దీనివల్ల ఉజ్వల లబ్ధిదారులందరికీ రూ.500 కే సిలిండర్ లభించినట్లు అవుతుంది. ఈ ఆలోచనను కూడా వైసీపీ పరిశీలిస్తోంది. గ్యాస్ సిలిండర్ విషయంలో తాము చాలా చాలా చేసినట్లుగా కనిపించాలి. అదే సమయంలో ప్రభుత్వం మీద తక్కువ భారం పడాలి.. అనేదిశగా ఆలోచనల కోసం కసరత్తు చేస్తున్నారు. ఏదేమైనా ప్రజలను ఆకట్టుకుంటున్న తెలుగుదేశం మేనిఫెస్టో అంశాలకు కౌంటర్లు తయారుచేసే పనిలో బిజీగా ఉన్నారు.
కౌంటర్ హామీల వేటలో బిజీగా జగన్ వ్యూహకర్తలు!
Wednesday, January 22, 2025