ఇంతకూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం ద్వారా ఏమైనా ఉపశమనం పొందారా? లేదా, హైకోర్టు ఎదుట తమ వాదనలను వినిపించే క్రమంలో మరింతగా ఈ కేసులో ఇరుక్కుపోయారా? హైకోర్టు న్యాయమూర్తులు అడిగిన కొన్ని ప్రశ్నలు, వాటికి అవినాష్ తరఫు నుంచి చెప్పిన జవాబులు ఇవన్నీ గమనించిన ప్రజలకు రకరకాల సందేహాలు కలుగుతున్నాయి.
ప్రధానంగా వారి ఒక వాదనను గమనిస్తే.. దస్తగిరి వాంగ్మూలం మినహా అవినాష్ పై ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు. కానీ, గూగుల్ టేకవుట్ ద్వారా సీబీఐ సేకరించిన వివరాలను గమనిస్తే.. దస్తగిరి అసలేమీ నోరు విప్పకపోయినా, అప్రూవర్ గా మారకపోయినా సరే.. సీబీఐ , అవినాష్ ను విచారించడానికి తగిన ఆధారాలను సంపాదించిందని అందరికీ అర్థమవుతోంది.
బంధువు కనుక వెంటనే హత్యాస్థలికి అవినాష్ రెడ్డి వెళ్లారని, గదిలోని రక్తపు మరకలను శుభ్రం చేయడం వెనుక ఎలాంటి కుట్ర లేదని అవినాష్ న్యాయవాదులు కోర్టుకు స్పష్టం చేశారు. ఏమైనా కుట్ర ఉన్నదా లేదా అనేది తర్వాతి సంగతి.. రక్తపు మరకలను అవినాష్ ఆధ్వర్యంలోనే తుడిచేసి శుభ్రం చేయించినట్టుగా ఈ మాటలతో వారు కోర్టు ఎదుట ఒప్పుకున్నట్టు అయింది.
వివేకాకు గుండెపోటు అని ఎందుకు చెప్పారని న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు.. అక్కడున్న వారు గుండెపోటు అని చెబితే అదే విషయం చెప్పారంటూ న్యాయవాదులు చెప్పడం తమాషాగా ఉంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి కాన్వెంటుకు వెళుతున్న పసిపిల్లవాడు కాదు, ఎవరు ఏం చెబితే అదే నిజమని నమ్మడానికి. పైగా తమ దగ్గరి బంధువు గనుక వెంటనే అక్కడకు వెళ్లినట్టు వాళ్లే ఒప్పుకుంటున్నారు. వెళ్లిన వ్యక్తికి ఎవరో ఒకరు ఆయన గుండెపోటుతో మరణించినట్టు చెప్పారే అనుకుందాం. ఆ సమయంలో తన బాబాయి అయిన వివేకానందరెడ్డి తలకు పెద్ద గాయమై, ఇల్లంతా, బాత్రూం అంతా నెత్తురు మరకలు ఉంటే.. దానిని అవినాష్ రెడ్డి ఎలా నమ్మారు. ఆయన చెబుతున్న ప్రకారం.. వివేకానందరెడ్డి హత్యకు రెండు రోజుల ముందు కూడా, ఎంపీగా అవినాష్ విజయం కోసం చుట్టు పక్కల ప్రాంతాల్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారట. మరి, అలాంటప్పుడు, తాను ప్రాతినిధ్యం వహించిన సీటునుంచి అవినాష్ ను గెలిపించడం కోసం అంతగా పాటుపడుతున్న బాబాయి వివేకా అలా రక్తపుమరకల నడుమ చనిపోగా, గుండెపోటు అని ఎవరో చెబితే అవినాష్ ఎలా నమ్మారు? చిటికెలో ఆ మాట నమ్మేసి దానినే తాను కూడా ఎందుకు ప్రచారంలో పెట్టారు? ఇలాంటి వన్నీ జవాబు దొరకని ప్రశ్నలే.
న్యాయస్థానంలో అవినాష్ తరఫు వాదనలు చూసినప్పుడు కేసులో ఆయన పాత్ర గురించి మరింతగా అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.
కోర్టు సాక్షిగా అవినాష్ పూర్తిగా ఇరుక్కుపోయారా?
Sunday, January 19, 2025