ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అమరావతి రాజధాని పట్ల కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారనే సంగతి రాష్ట్రం మొత్తం గుర్తిస్తున్న సంగతి. పేదలకు ఇళ్లస్థలాల పంపిణీ అనే ముసుగులో.. అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని కలగన్న అమరావతిలో, ప్రపంచంలోనే అతిపెద్ద స్లమ్ ఏరియాను నిర్మించడానికి సంకల్పించినట్టుగా యాభై వేల మందికి సెంటుభూమి ఇళ్లస్థలాలను పంచిపెట్టారు జగన్మోహన్ రెడ్డి. అదే క్రమంలో అమరావతి స్వప్నాన్ని మరింతగా శిథిలం చేయడానికి ఆయన తన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.
అమరావతి అభివృద్ధి కోసం రాష్ట్రప్రభుత్వం తరఫున ఒక్కరూపాయి నిధులనైనా వెచ్చించకపోతుండగా.. కేంద్రం అందించే నిధులను కూడా దారిమళ్లించడానికి జగన్ పూనుకుంటుండడం ఇక్కడ గమనార్హం. ఇప్పటికే అమరావతి మాస్టర్ ప్లాన్ ను ఇష్టానుసారం మార్చేసి ఆర్ 5 జోన్ సృష్టించి చాలా న్యాయపరమైన వివాదాలను జగన్ సర్కారు కొనితెచ్చుకుంది.
తాజాగా అలాంటి మరో ప్రయత్నానికి తెరతీసింది. కేంద్ర నిధులతో అమలయ్యే అమరావతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులోనూ ఇష్టానుసారం మార్పు చేర్పులు చేశారు. కొన్ని ప్రాజెక్టులను కుదించారు. వాటికి బదులుగా.. సెంటు భూమి స్థలాలు ఇచ్చిన చోట అంగన్ వాడీ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీల్ని ప్రతిపాదిస్తూ మార్పులు చేసింది. అయితే కేంద్రప్రభుత్వ నిధులతో అమలయ్యే స్మార్ట్ సిటీ డిజైన్లను, ప్రతిపాదనలను ఎలా పడితే అలా మార్చడానికి వీల్లేదు. కేంద్రం అనుమతి లేకుండా ఆ మార్పులు చేయడానికి కుదరదు. సర్కారు కొత్తగా స్మార్ట్ సిటీ ప్రతిపాదనలు మార్చి.. సెంటు భూములిచ్చిన చోట అంగన్ వాడీ భవనాలు కడతాం అంటే.. అది మరొక న్యాయవివాదం అయ్యే అవకాశం ఉంది. స్మార్ట్ సిటీ నిధులను దారిమళ్లించడం తగదని ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే మొత్తం మొదటికి వస్తుంది.
పైగా సెంటు భూమి స్థలాలను జగన్ ఆడంబరంగా పంచిపెట్టారు గానీ.. వాటికి ఇంకా చట్టబద్ధత లేదు. పొందిన వారు ముఖప్రీతికి మాత్రమే ఆ కాగితాలు తీసుకువెళ్లారు. ఆ స్థలాల్లో వారు ఇప్పట్లో నిర్మాణాలు చేపట్టడానికి లేదు. కోర్టు ఇచ్చే తుదితీర్పుకు లోబడి మాత్రమే.. వారికి ఆ స్థలాలపై యాజమాన్య హక్కులు వస్తాయి. అసలు పేదలకు ఇచ్చిన స్థలాలకే చట్టబద్ధత లేని పరిస్థితుల్లో ఆ కాలనీల్లో అంగన్ వాడీల కోసం అంటూ.. కేంద్ర స్మార్ట్ సిటీ నిధుల మళ్లింపు వివాదాస్పదం అవుతోంది. అమరావతికి కేంద్రం కంట్రిబ్యూషన్ అయిన స్మార్ట్ సిటీ నిధులను జగన్ ఇలా దారి మళ్లించే ప్రయత్నం చేయడంపై కమల నాధులు కూడా సీరియస్ అవుతున్నారు. కోర్టును ఆశ్రయించే ఆలోచన చేస్తున్నారు.
కోర్టు వివాదాలే జగన్ లక్ష్యమా?
Sunday, December 22, 2024