కోర్టుల నుంచి ఇంకా క్లియరెన్స్ రాకపోయినా సరే జగన్ మాత్రం తన దూకుడును అదేతీరుగా కొనసాగిస్తూ ఉన్నారు. నేను మోనార్క్ ని, చేయదలచుకున్నది చేసేస్తాను.. కోర్టు తీర్పులతో నాకు పనేముంది.. కోర్టు తీర్పులకోసం నేను ఎదురుచూడాల్సిన అవసరం ఏముంది.. అన్నట్టుగా ఆయన రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు. తాజాగా అమరావతి రాజధానిలో వివాదాస్పద ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల నిర్మాణాలకు కూడా జగన్ శంకుస్థాపన చేశారు. కేవలం శంకుస్థాపన మాత్రమేకాదు.. ఈ సందర్భంగా బోలెడన్ని అబద్ధాలను కూడా వండి వార్చారు.
అమరావతి ప్రాంతంలో ఆర్ 5 జోన్ అంటూ జగన్ సర్కారు కొత్త వివాదాన్ని రాష్ట్రానికి కానుకగా ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అమరావతిలో ఒక్క ఇటుక పెట్టి కించిత్తు పని చేయలేదు గానీ.. అమరావతి ని సామాజిక రాజధానిగా తయారుచేస్తానని జగన్ హామీలు ఇస్తున్నారు. ఆర్ 5 జోన్ పేరుతో 1400 ఎకరాల సీఆర్డీయే భూములు తీసుకుని వాటిని 25 లేఅవుట్లుగా విభజించి 50,793 మందికి స్థలాల పంపిణీచేసేశారు. తమాషా ఏంటంటే.. అక్కడ మొత్తం అందరు లబ్ధిదారులూ నూరుశాతంగా.. ప్రభుత్వమే తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరుకున్నారట. అందుకని ప్రభుత్వం తరఫునే అందరికీ ఇళ్లు నిర్మించే పనులకు జగన్ శంకుస్థాపన చేశారు.
అయితే బాధాకరం ఏంటంటే.. ఈ జగన్ హామీలతో, మాటల గారడీతో పేదలు వంచనకు గురవుతున్నారనేది పలువురి అభిప్రాయం. ఈ జోన్ లో పంపిణీ చేసిన ఇళ్లస్థలాలకు సంబంధించి.. కోర్టు తుది తీర్పు వెలువరించేవరకు ఆ స్థలాలపై లబ్ధిదారులకు యాజమాన్య హక్కులురావు. ఆ విషయం సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అందుకే జగన్ ఏదో ఆర్భాటంగా నిర్వహించిన కార్యక్రమానికి హాజరై ఇళ్లపట్టాలు తీసుకున్న వారు కూడా.. వాటి గురించి పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాన్నే ఇళ్లు నిర్మించాలని చెప్పేశారు. కోర్టు కేసులు అన్నీ తెమిలి, నిర్మాణాలు పూర్తయితే అప్పుడు చూసుకోవచ్చులే అనేది వారి ఆలోచన.
జగన్ మాత్రం.. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా కుట్రదారులు అనేక ప్రయత్నాలు చేశారని.. వారందరితో పోరాడి కోర్టుల్లోనెగ్గి పేదలకు ఇళ్లు ఇస్తున్నామని అంటున్నారు. కానీ.. నిజానికి కేసులు ఇంకా అలాగే ఉన్నాయి. స్థలాల కేటాయింపు గురించే తుది తీర్పు రానేలేదు. ఇళ్ల నిర్మాణం గురించి కూడా హైకోర్టు తీర్పు రిజర్వుచేసి ఉంది. అయినా సరే.. కోర్టుల్లో గెలిచి కడుతున్నాం అని పచ్చిగా అబద్ధాలు చెబుతూ జగన్ పేదలను మాయ చేస్తున్నారని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.