కోడికత్తి దాడి అనేది వర్తమాన రాజకీయాల్లో అతిపెద్ద డ్రామా! తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఇలాంటి కామెడీ డ్రామా నడిపించి.. తాను అధికారంలోకి రావచ్చుననే ఆలోచన మరెవ్వరికీ వచ్చి ఉండదు కూడా. చిన్ని చిన్న గిమ్మిక్కులను ఆశ్రయించి.. నాయకుల ఇమేజి పెంచడానికి ప్రయత్నించగల తెలివితేటలున్న ప్రశాంత్ కిశోర్ పబ్లిసిటీ వ్యవహారాలు చూస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సారథి జగన్ మీద కోడికత్తి తో జరిగిన ‘‘హత్యాప్రయత్నం’’ అప్పట్లో ఒక సంచలనం. అత్యుత్సాహానికి పోయిన ఓ కుర్రవాడు ఆ కేసులో ఇప్పటిదాకా జైల్లోనే గడుపుతున్నాడు.
ఇదంతా ఒక ఎత్తు. ఆ కేసును ఎన్ఐఏ దర్యాప్తు మొత్తం ముగించింది. ఆ తర్వాత.. వారు సాగించిన విచారణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంతృప్తికరంగా అనిపించలేదు. ఆయన మరింత లోతైన విచారణ జరగాలంటూ కోర్టుకు ప్రత్యేకంగా విన్నవించుకున్నారు. ఆ మేరకు మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దర్యాప్తు మొత్తం పూర్తయిన తర్వాత.. ఇంకా లోతైన విచారణ అడగడంలో అర్థం లేదని ఎన్ఐఏ వాదించింది. అన్ని కోణాల్లో విచారణ జరిపామని, అందులో కుట్ర లేదని తేలిందని, నిందితుడు శ్రీనివాసరావు మినహా మరొకరి పాత్ర గురించిన ఆధారాలు లేవని ఎన్ఐఏ కోర్టుకు తెలియజేస్తోంది. నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీం కూడా జగన్ పిటిషన్ ను అనుమతించవద్దని కోర్టుకు విన్నవిస్తున్నారు. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావు ఇప్పటికే అయిదేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న విషయాన్ని కూడా సలీం గుర్తుచేస్తున్నారు.
కామెడీగా జనం మొత్తం నవ్వుకోవడానికి అలవాటు పడిన కోడికత్తి కేసులో ‘‘మరింత లోతైన విచారణ’’ కోరడం ద్వారా.. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రకంగా నవ్వులపాలయ్యారనే చెప్పాలి. లేదా.. కోడికత్తి డ్రామా ఆర్టిస్టు శ్రీనివాసరావుకు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సంబంధం ఉన్నదని, చంద్రబాబే అతడితో ఆ దాడి చేయించాడని ఎన్ఐఏ తమ దర్యాప్తులో తేల్చేదాకా ఆయన మళ్లీమళ్లీ లోతైన దర్యాప్తు కోరుతూ పిటిషన్లు వేస్తూనే ఉంటారేమోనని జనం నవ్వుకుంటున్నారు.
అయితే ఈ వ్యవహారంలో జగన్ ‘లోతైన దర్యాప్తు’ కోరడం వెనుక ఇంకో డ్రామా ఉండవచ్చుననే అనుమానాలు కూడా వినవస్తున్నాయి. జగన్ మీద ప్రజల్లో సానుభూతి రావడానికి, ఆయన సీఎం కావడం కోసమే తాను ఈ దాడి చేసినట్లు నిందితుడు గతంలో పలు సందర్భాల్లో చెప్పాడు. అయితే నిందితుడు ఈ కేసులో త్వరగా బయటకు వచ్చేస్తే.. బహుశా, ఇలాంటి దాడి వెనుక ఉన్న అసలు రహస్యాలను వెల్లడిస్తాడేమోనని, అతను బయటకు రాకుండా ఉండేందుకే జగన్ మళ్లీ మళ్లీ ‘లోతైన దర్యాప్తు’ పేరుతో జాప్యం జరగడానికి ప్లాన్ చేస్తున్నారేమోనని ఒక వాదన వినిపిస్తోంది.