కోటంరెడ్డి రేంజిని హఠాత్తుగా పెంచేస్తున్న వైసీపీ!

Monday, December 23, 2024

అటు కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి ఒకేఒక్కడు ఒకవైపు.. ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు కాకాణి గోవర్దన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు, ప్రధానంగా ముఖ్యమంత్రి గళాన్ని తాను ప్రెస్ మీట్లలో వినిపిస్తూ ఉండే సలహాదారు రామకృష్ణారెడ్డి అందరూ రెండో వైపు.. రెండు వర్గాలుగా బీభత్సమైన మాటల యుద్ధం జరుగుతోంది. అసలే దూకుడుకు మారుపేరైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు సొంత పార్టీ వారి మీదనే హద్దూ అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ మీద ఏదో అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఊరుకోలేదు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పోటీచేస్తాననే సింపుల్ డైలాగుతో సరిపెట్టుకోలేదు. నన్ను అనుమానిస్తున్నారు.. నా ఫోను ట్యాపింగ్ చేస్తున్నారు.. అనుమానం ఉన్న చోట నేనుండలేను అని అంటూనే.. నీ ఫోను ట్యాపింగ్ చేస్తే నీకు ఎలా అనిపిస్తుంది జగనన్నా అంటూ డైరక్టుగా జగన్ కే సవాలు విసిరారు. కోటంరెడ్డి డైరక్టుగా జగన్ మీదనే ఎటాక్ చేస్తుండే సరికి.. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే చాలు జగన్ గుడ్ లుక్స్ లో పడుతామనే అభిప్రాయం అందరికీ ఏర్పడిపోయినట్టుగా ఉంది. పైన చెప్పుకున్న పేర్లు మచ్చుకు నాలుగు మాత్రమే. నిజానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో పైస్థాయి వారినుంచి కిందిస్థాయి వారి వరకు ఎవరికి మీడియా ముందు మాట్లాడే అవకాశం వచ్చినా.. కోటంరెడ్డి మీద విరుచుకుపడడం, కోటంరెడ్డిని తిట్టడం మానడం లేదు. దీని ప్రభావం శత్రువులు సంఖ్య పెరుగుతున్న కొద్దీ.. వారందరితోనూ తలపడుతున్న వ్యక్తిగా కోటంరెడ్డి హీరో అయిపోతున్నారు.
తన మీద ఎవ్వరు విమర్శలు చేసినా కోటంరెడ్డి ఊరుకోవడం లేదు. అందరికీ కౌంటర్లు ఇస్తున్నాడు. అందరి మీద విరుచుకుపడుతున్నాడు. పార్టీలో సుదీర్ఘ కాలంనుంచి ఉన్న నాయకుడు కావడంతో.. వారందరి పాత చరిత్రలను కూడా తవ్వుతున్నాడు. నాటకీయమైన, రక్తికట్టించే హావభావ విన్యాసాలతో వారికి సవాళ్లు విసురుతున్నాడు. దమ్ముంటే తన మీదకు రావాలని అంటున్నాడు. తన గొంతు మూయించాలనుకుంటే గనక.. తనను ఎన్‌కౌంటర్ చేయడం ఒక్కటే ప్రభుత్వానికి మార్గమని భారీ పంచ్ డైలాగులు వేస్తున్నారు.
ఇలా ఎక్కువ మంది కోటంరెడ్డిపై దాడికి దిగుతూ ఆయన రేంజిని హఠాత్తుగా పెంచేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. నిజానికి లోకల్ గా నెల్లూరు జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్చార్జి గనుక, పైగా తన మీదనే డైరక్టుగా విమర్శలు చేస్తున్నాడు గనుక.. బాలినేని శ్రీనివాసరెడ్డి కి జవాబులు చెప్పక తప్పదు. నెల్లూరు జిల్లా మంత్రి గనుక కాకాణి గోవర్దన్ రెడ్డి జోక్యం చేసుకున్నా పరవాలేదు. అలా కాకుండా, వైసీపీలో ప్రతినాయకుడూ కోటంరెడ్డిని విమర్శిస్తూ, వారందరినీ తాను ఒకే ఒక్కడుగా ఎదుర్కొని ఆయన వీర విహారం చేస్తుండడం జరుగుతోంది.
తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంకా కోటంరెడ్డికి మద్దతుగా మాటల యుద్ధంలోకి దిగనేలేదు. కోటంరెడ్డి అనేకమంది శత్రువులను ఎదుర్కొంటున్న ఒకేఒక్కడుగా హీరోయిజం సంతరించుకోవడానికి అది కూడా ఒక కారణంగా మారుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles