జనవరి నుంచి పెన్షను 250 రూపాయలు పెరుగుతుందనే ఆనందం కంటె, పెన్షనర్ల జాబితాలో కోత పెడుతున్నారని.. ప్రతి నియోజకవర్గంలో దాదాపు మూడువేల మందిని పెన్షనర్ల జాబితానుంచి తొలగిస్తున్నారనే వార్తలు ప్రజల్లో ఎక్కువ ఆందోళన కలిగిస్తున్నాయి. పెన్షను పెంచడం అంటే.. పెన్షనర్ల సంఖ్య తగ్గించడం అన్నట్టుగా తయారవుతున్నదని ప్రజలు భయపడుతున్నారు. ప్రభుత్వం పెట్టిన ఆస్తులు, కరెంటు యూనిట్ల నిబంధనలు తమకు ఏవీ వర్తించకపోయినా సరే.. తమ పెన్షన్లు తొలగుతున్నాయనే బాధ చాలా మందికి కలుగుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం.. ఈ వ్యవహారంపై గుస్సా అవుతున్నారు. తన నియోజకవర్గంలో ఒక్కరికి కూడా పెన్షను తొలగించడానికి వీల్లేదని ఆయన హెచ్చరిస్తున్నారు. ఏ ఒక్క పెన్షనరుకు తొలగించినా ఊరుకునేది లేదంటున్నారు. ఒకసారి పెన్షను తొలగిస్తే మళ్లీ వచ్చేలా చేయడం చాలా కష్టం అని.. అందుకే వద్దంటున్నానని ఆయన అంటున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇలా ప్రజల పక్షాన నిలబడి వారి కష్టాలను స్వయంగా గమనిస్తూ.. వారికోసం తమ సొంత ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా నిలదీయగల ధైర్యం ఎందరు వైసీపీ ఎమ్మెల్యేలకు ఉంటుంది? ఎందరు నిజంగా ప్రజలకోసం, ప్రజల పక్షాన పాటుపడుతున్నారు? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా ఆడంబరంగా జనవరి నుంచి అవ్వాతాతలకు పెన్షను 250 రూపాయలు పెంచి 2750 ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే పెన్షనర్లలో మాత్రం కోత పెడుతున్నారు. కోటంరెడ్డి మాటలనే గమనిస్తోంటే.. 200 రూపాయలు పెన్షను ఉన్న రోజుల నుంచి పొందుతున్న వృద్ధురాలికి ఇప్పుడు తొలగిస్తున్నట్టుగా నోటీసు అందిన సంగతి కూడా మనకు తెలుస్తుంది. ఇంత ఘోరంగా అధికారులు ఎలా జాబితాలను తయారు చేశారో తెలియదు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇంతమంది పేర్లు తీసేయాలి అనేదే తప్ప మరో కొలబద్ధ ఏదీ వీరికి లేదేమో అని కూడా అనిపిస్తోంది. ‘పేర్లు తొలగించాలి’ అని డిసైడైన తరువాత ముందు తెలుగుదేశం వారిగా అనుమానం ఉన్న లబ్ధిదారుల పేర్లను తొలగించడానికే చూస్తారనేది ప్రజలకున్న మరో అనుమానం. అయితే సొంత ఇల్లు స్థలం, 300 యూనిట్లు దాటిన కరెంటు లాంటి కొలబద్ధలను కొన్నింటిని ప్రభుత్వం తొలగింపునకు ప్రకటించింది. ఆ రకంగా లేని వారికి కూడా తొలగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ప్రభుత్వ నిర్ణయం. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నచోట.. తొలగింపులపై సహజంగానే ఆందోళనలు చేస్తారు. అయితే తమకు ప్రజాప్రయోజనాలు మాత్రమే ముఖ్యం అనుకుంటే.. వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎందరు ధైర్యంగా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలాగా ఈ అరాచకాన్ని నిలదీయగలరు. తాము ప్రజల మనుషులుగా ఎమ్మెల్యేలు అయ్యాం అని.. డూడూ బసవన్నలం కాదని తమ వ్యక్తిత్వానికి వన్నె తెచ్చుకోగలరు? చూడాలి!!
కోటంరెడ్డి ధైర్యం.. ఎందరు ఎమ్మెల్యేలకు ఉంది?
Wednesday, December 25, 2024