కోటంరెడ్డి చేరికపై సోమిరెడ్డిలో గుబులు!

Wednesday, January 22, 2025

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలగంటున్న భవిష్యత్తు ఆయనకు దొరుకుతుందా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనకు మంత్రి పదవి దక్కలేదని అక్కసుతో ఉడికిపోతూ.. పార్టీ మీద బురద చల్లే కార్యక్రమానికి కోటంరెడ్డి తెరలేపిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని కూడా ఆయన ప్రకటించారు. అక్కడినుంచి విమర్శలు ప్రతి విమర్శల రాజకీయం జోరుగా నడుస్తోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. కోటంరెడ్డి పార్టీలో చేరిక గురించి, ఆయన అనుకుంటున్నట్టుగా వచ్చే ఎన్నికల్లో పోటీచేయడం గురించి.. తెలుగుదేశానికి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాటలు చిత్రంగా ధ్వనిస్తున్నాయి. కోటంరెడ్డి ఇప్పటిదాకా తనతో మాట్లాడనేలేదని, అయినా తాము ఫలానా చోట నుంచి పోటీచేస్తాం అని ప్రకటించే స్వతంత్రత పార్టీలో ఎవ్వరికీ లేదని, పార్టీ ెలా నిర్ణయిస్తే అలా, అందరూ నడుచుకోవాల్సిందేనని, ఎక్కడినుంచి పోటీచేయమంటే అక్కడినుంచి పోటీచేయాల్సిందేనని సెలవిచ్చారు. ఇదంతా చూడబోతే.. ఏదో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , కోటంరెడ్డి చేరడానికి మోకాలడ్డుతున్నట్టుగా కనిపిస్తోంది. మరో రకంగా చెప్పాలంటే సోమిరెడ్డి భయపడుతున్నట్లుగా కూడా కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాల్లో వైసీపీతో తలపడగల మరో బలమైన రెడ్డి నాయకుడు తమ పార్టీలోకి రావడం పట్ల సోమిరెడ్డిలో గుబులు మొదలైనట్లుగా కనిపిస్తోంది.
ఎమ్మెల్యే కావాలని కలగనే ప్రతి ఒక్కడూ.. మంత్రిగా పనిచేయాలని కూడా ఉవ్విళ్లూరుతుంటాడు. తమ తమ అర్హతల గురించి ఏ ఒక్కరికీ ధ్యాస ఉండదు. మంత్రి పదవి గురించి కోరిక మాత్రమే ఉంటుంది. చాలా సందర్భాల్లో ఎందుకూ కొరగాని వ్యక్తులు కూడా మంత్రులు అయిపోవడం, ఇలాంటి ఆశావహుల్లో మరింత కోరిక పెంచుతుంటుంది. ఆ రకంగా చూసినప్పుడు.. వైసీపీలో మూడు తరాలుగా వైఎస్ కుటుంబానికి సేవ చేసినప్పటికీ.. మంత్రి పదవి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేసిన కోటంరెడ్డి,, తెలుగుదేశంలో చేరడం ద్వారా ఆ పదవిని ఆశిస్తే తప్పులేదు. అదే సమయంలో ఇతర కాంబినేషన్లను కూడా లెక్క వేసుకోవాలి. ఆనం రామనారాయణ రెడ్డి కూడా తెదేపాలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మంత్రిగా అనుభవం, సీనియారిటీ, పెద్దరికం తదితర విషయాలు ఉన్నందున తనకు కూడా మంత్రి పదవి కావాలని ఆయన కూడా కోరుకుంటారు. నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం నుంచి గ్యారంటీగా కేబినెట్ బెర్త్ దక్కించుకునే నాయకుడిగా సోమిరెడ్డికి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరు వచ్చి చేరితే.. తన మంత్రిపదవి అవకాశాలకు గండిపడుతుందా అని ఆయన భయపడుతున్నట్లుంది. వీళ్లందరూ మంత్రి పదవి ఆశించే వస్తుంటారు గనుక.. చంద్రబాబునాయుడు వీళ్లందరికీ మంత్రులుగా అయిదేళ్ల పదవీకాలాన్ని ముక్కలు చేసి పంచిపెడితే కూడా.. తన ప్రాభవం తగ్గుతుందని సోమిరెడ్డి ఆలోచిస్తుండవచ్చు. అందుకే ఆయన కోటంరెడ్డి మాటలపై పుల్లవిరుపు వ్యాఖ్యానాలు చేస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. అయినా.. పార్టీకి విజయాన్ని కోరుకునే వారు కొన్ని త్యాగాలకు సిద్ధపడాలి. అలాంటి త్యాగశీలత సోమిరెడ్డి వద్ద ఉన్నదా? పార్టీ అధికారంలోకి వస్తే చాలు.. ఈ దఫా తనకు మంత్రి పదవి వద్దని ఆయన చెప్పగలరా అనే చర్చ జనంలో నడుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles