నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ దూరం చేసుకుంటున్నదా? కాస్త దూకుడుగా మాాట్లాడే అలవాటు ఉన్న ఈ ఎమ్మెల్యేను జగన్ భరించలేకపోతున్నారా? అనే కొత్త అనుమానాలు ఇప్పుడు మొదలయ్యాయి. మామూలుగా అయితే జగన్ కు అత్యంత విశ్వసనీయులు, విధేయులు అయిన ఎమ్మెల్యేల్లో కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి కూడా ఉంటారు. ఇప్పుడు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న తీరు గమనిస్తోంటే.. ఆయనకు పొమ్మనకుండానే పొగబెడుతున్నారా? అనే అభిప్రాయం కలుగుతోంది.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తున్నారని, ఆయన మీద ఇంటలిజెన్స్ నిఘా పెట్టారని ఆయన సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.
ప్రజలతో మమేకమై కలసిమెలసి ఉంటూ , అవసరమైతే అధికార్లమీద విచక్షణ రహితంగా విరుచుకుపడుతూ దూకుడుగా వ్యవహరించే ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పేరుంది. అయితే ఇటీవలి కాలంలో ఆయన వేర్వేరు సందర్భాల్లో ప్రభుత్వం తీరు మీద అసహనం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి మసీదు నర్మాణానికి హామీ ఇస్తే.. దానికి డబ్బులివ్వలేదని ఆయన తీవ్రస్థాయిలో అధికార్ల మీద ధ్వజమెత్తారు. అలాగే, వృద్ధాప్య పెన్షనర్ల జాబితాలో కోత విధించేతీరుపై కూడా ధ్వజమెత్తారు. ఇవన్నీ పార్టీకి చేదు పరిణామాలు. ఆ తర్వాత జగన్ స్వయంగా కోటంరెడ్డిని పిలిపించి మాట్లాడారు. కోటంరెడ్డి మీద సదభిప్రాయంతో జగన్ ఆయనను పిలిపించి మాట్లాడారని, అదే జిల్లాలో జగన్ కు కంటినలుసులాగా తయారైన మరో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి స్థానంలో మరొకరిని ఇన్చార్జిగా నియమిమచారని జనం అనుకున్నారు.
అయితే గత మూడు నెలలుగా తన ఫోను ట్యాప్ చేస్తున్నారని, ఇంటెలిజెన్స్ నిఘా పెట్టారని కోటంరెడ్డి అనడం గమనిస్తోంటే.. జగన్ పిలిపించి మాట్లాడిన సమయంనుంచే ఆయన మీద నిఘా ఉన్నట్టుగా అర్థమవుతోంది. కోటంరెడ్డి వంటి విధేయులైన ఎమ్మెల్యేలమీద కూడా నిఘా పెట్టి దూరం చేసుకుంటే.. జగన్ కు ముందు ముందు సొంత పార్టీ వాతావరణం ఎలా మారుతుంది అనే భయం పార్టీ వర్గాల్లో ఉంది. కేవలం భజన పరులు, అవినీతిపరులు, డూడుబసవన్నలు మాత్రమే పార్టీలో మిగులుతారా? అని పలువురు అంటున్నారు.
కోటంరెడ్డినీ దూరం చేసుకుంటే.. జగన్‌కు నష్టమే!
Friday, November 15, 2024