గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకు మళ్ళీ టికెట్ ఇస్తారా లేదా అనేది సందేహాస్పదంగా కూడా ఉంది. స్థానికంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు అంబటి నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనను మళ్ళీ అభ్యర్థిగా పోటీ చేయిస్తే గనుక ఓడించి తీరుతామని పార్టీని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి అంబటి రాంబాబు ఒక వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. నియోజకవర్గంలో తన సొంత పార్టీ నేతలు తనను ఛీత్కరించుకుంటున్న కారణంగా తనకు అనుకూలంగా పనిచేయడానికి కొత్త నాయకులను ఇతర పార్టీల నుంచి ఫిరాయింపజేసి వైసీపీలోకి తీసుకువస్తున్నారు.
అదే సత్తెనపల్లి నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా నెగ్గిన ఎర్రం వెంకటేశ్వర రెడ్డి తాజాగా తన అనుచరులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే ఎర్రం వెంకటేశ్వర రెడ్డి పార్టీలో చేరడం జరిగింది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన ఎర్రం కేవలం 9వేల పైచిలుకు ఓట్లు మాత్రం సాధించారు. అప్పటి నుంచి రాజకీయంగా స్తబ్దుగానే ఉన్నారు. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక మంత్రి అంబటి రాంబాబు కీలకంగా మంత్రాంగం నడిపినట్లుగా వినిపిస్తోంది. ఇదంతా కూడా నియోజకవర్గంలో.. సొంత పార్టీలో తన పట్ల ఉన్న వ్యతిరేకతకు చెక్ పెట్టడానికే అని తెలుస్తోంది.
సత్తెనపల్లి నియోజకవర్గంలోని వైసీపీ సీనియర్ నేత చిట్టా బాలకృష్ణారెడ్డి తిరుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. అంబటి రాంబాబు నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంబటికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన చిట్టా- తన ప్రాణాలొడ్డి అయినా సరే ఎన్నికల్లో టికెట్ సాధిస్తానని చాటుకున్నారు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు గనుక ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని అంటున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో తన మీద పుట్టిన అసంతృప్తిని బుజ్జగించుకోవడంలో విఫలమైన మంత్రి అంబటి రాంబాబు మరోసారి విజయం సాధించడం కోసం ఇతర పార్టీల వారి మీద ఆధారపడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ ఎత్తుగడలన్నీ ఓకే గాని ఎంత మేరకు వర్క్ అవుట్ అవుతాయో వేచి చూడాలి. సొంత పార్టీలోని నాయకులందరూ వ్యతిరేకిస్తుండగా.. వలస నేతలను తీసుకువచ్చి వారిని బోయీలుగా వాడుకుని పల్లకీ సవారీ చేస్తానంటే జగన్ అనుమతిస్తారా అనేది కూడా గమనించాలి.
కొత్త బోయీలను వెతుక్కుంటున్న అంబటి !
Wednesday, January 22, 2025