త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు సమకూర్చిన మల్లీశ్వరి సినిమాలో ఒక డైలాగు ఉంటుంది.
‘‘ఒక ఎలుక- మా ఇంట్లో పిల్లి ఉంది అని చెప్పిందనుకోండి. అప్పుడు ఆ ఎలకకు ఏమైనా అయితే, అందరికీ పిల్లి మీదనేగా అనుమానం వస్తుంది’’ అని! ఇప్పుడు వర్తమాన రాజకీయాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి తనకు వైఎస్ జగన్ వల్ల, అవినాష్ రెడ్డి వల్ల వారి అనుచరుల వల్ల ప్రాణహాని ఉన్నదని కడప జిల్లా ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎస్పీ ఆయనకు భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయడంలో ఆయన డ్రైవరు దస్తగిరి కూడా స్వయంగా పాల్గొన్న సంగతి వారే సీబీఐ విచారణలో అంగీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. దస్తగిరి తర్వాత అప్రూవర్ గా మారి, అసలు వివేకాను ఎందుకు హత్య చేయవలసి వచ్చిందో, తనను ఎవరు అప్రోచ్ అయ్యారో, ఏం ఆఫర్ చేశారో.. తెర వెనుక ఎవరు ఉన్నారో సమస్త వివరాలను సీబీఐకు వెల్లడించారు. ఆ తర్వాత ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. దస్తగిరి అప్రూవర్ గా మారి వెల్లడించిన వివరాలను ఆధారంగా చేసుకుని, తదనుగుణంగా ఇతర ఆధారాలను కూడా సేకరిస్తూ సీబీఐ ఈ హత్య కేసు విషయంలో పట్టు బిగిస్తూ వస్తోంది. వైఎస్ అవినాష్ రెడ్డి, తండ్రి భాస్కరరెడ్డి ప్రధాన సూత్రధారులుగా చెబుతోంది.
ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి నుంచి, ఆయన వెనుక ఉన్న వైఎస్ జగన్ నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని దస్తగిరి మీడియా ముందుకు రావడం విశేషం. అప్రూవర్ గా మారి వివరాలు వెల్లడించిన తర్వాత.. ఇప్పటికే ఆయనకు పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. తాజాగా దస్తగిరి మరోసారి.. అవినాష్ రెడ్డి అనుచరులు తనను అనుసరిస్తున్నారని, వారినుంచి తనకు ప్రాణహాని ఉన్నదని కడప ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశారు. ఐజీ, డీజీపీ, సీబీఐ వారికి కూడా ఈ ఫిర్యాదును రిజిస్టరు పోస్టు ద్వారా పంపుతానని చెప్పారు.
అయితే దస్తగిరి ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన భద్రత పెంచుతూ ఎస్పీ ఆదేశాలు జారీచేశారు. ఆయనకు 1+4 భద్రత ఏర్పాటుచేశారు. అసలే అవినాష్ చుట్టూ అనుమాన మేఘాలు ముసురుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వివేకా హత్య కేసులో క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి వేళ- దస్తగిరి మీద ఏదైనా దాడి జరిగితే తమకు ఇంకా పెద్ద నష్టం జరుగుతుందని వారు భయపడుతున్నట్లుగా ఉంది. అందుకే అడిగిన కొన్ని గంటలలోనే భద్రత పెంచుతూ ఎస్పీ ఉత్తర్వులు ఇచ్చినట్టుగా పలువురు భావిస్తున్నారు. అవినాష్ రెడ్డి అనుచరులు, ఆవేశంలో ఏ చిన్న తీవ్రమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ.. దాని ప్రభావం పార్టీ మీద పడుతుందనే భయంతోనే భద్రత పెంచినట్టుగా అంచనా వేస్తున్నారు. కొత్త తలనొప్పులు కొనితెచ్చుకోవడానికి జగన్ కోటరీ సిద్ధంగా లేదనే మాట వినవస్తోంది.