కొత్త కేసులో ఇరుక్కున్న అప్రూవర్ దస్తగిరి

Wednesday, January 22, 2025

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారి.. కేసు సంచలన పోకడలు పోతుండడానికి ప్రధాన కారకుడు అయిన దస్తగిరి మీద సరికొత్త పోలీసు కేసు నమోదు అయింది. దస్తగిరితో పాటు ఆయన భార్య షబానా మీద కూడా కలిపి పోలీసులు కేసు పెట్టారు. ఒక మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి, నిర్బంధించి, రకరకాల చిత్రహింసలకు గురిచేసినట్టుగా వీరి మీద కేసు నమోదు అయింది. సదరు మైనర్ బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. దస్తగిరిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందని పుకార్లు వస్తుండడం, తనకు ప్రాణహాని ఉన్నదని దస్తగిరి పలు సందర్భాల్లో వెల్లడించిన నేపథ్యంలో.. దస్తగిరి మీద మైనర్ బాలుడి కిడ్నాప్ కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.

==

త్రివిక్రమ్ సంభాషణలు సమకూర్చిన మల్లీశ్వరి సినిమాలో ఓ సీన్ ఉంటుంది..

‘‘ఎలుక, తనకు పిల్లి వల్ల ప్రాణాపాయం ఉన్నదని అందరితోను చెప్పిందనుకోండి. అప్పుడు ఎలుకకు ఏం జరిగినా పిల్లిదే కదా బాధ్యత’’ అంటాడు లాయరు దేవదాస్ కనకాల.

‘‘అప్పుడు పిల్లి ఏంచేయాలి.. కృష్ణారామా అంటూ కూర్చోవాలా’’ అని అడుగుతాడు కోట శ్రీనివాసరావు.

లాయరు ఒక ఉపాయం చెబుతాడు.

‘‘అంటే కత్తి మనదైనా, చెయ్యి మనది కాకూడదంటావ్’’ అంటూ ముక్తాయిస్తాడు కోట   శ్రీనివాసరావు.

ఎందుకోగానీ.. ఈ విషయంలో ఆ సీను గుర్తుకు వస్తోంది.

==

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ అయిన దస్తగిరి తనకు ప్రాణాపాయం ఉన్నదని తొలినుంచి అంటున్నాడు. మరోవైపు దస్తగిరి వాంగ్మూలం తర్వాతనే కేసు ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ, ఆయన తండ్రి భాస్కర రెడ్డి చుట్టూ బాగా బిగుసుకుంది. వారిలో భాస్కర రెడ్డి ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిలుపై బయట ఉన్నారు. ఇలాంటి సమయంలో దస్తగిరి ఏ చిన్న ప్రమాదం జరిగినా సరే.. అవినాష్ రెడ్డి మీదకు అనుమానాలు మళ్లే అవకాశం ఉంది. కాగా, దస్తగిరి ఇతర ప్రమాదాలేం జరగలేదు గానీ.. ఒక మైనర్ బాలుడి కిడ్నాప్, నిర్బంధం, హింస రూపంలో గట్టి సెక్షన్ల కింద కేసులే నమోదు అయ్యాయి.

దస్తగిరి తమకు అప్పు తీర్చాల్సి ఉన్న ఒక కుటుంబం నుంచి మైనర్ బాలుడిని తీసుకువెళ్లి తన వద్ద నిర్బంధించాడని, ఆ కుర్రాడి తల్లిదండ్రులకు ఫోను చేసి బెదిరించాడని, పిల్లాడిని హింసించారనే ఫిర్యాదుల మీద దస్తగిరి ని, ఆయన భార్య షబానాను కూడా నిందితులుగా చేరుస్తూ కేసు నమోదు అయింది. ఈ కేసులో పోలీసులు చాలా చురుగ్గా వ్యవహరిస్తారని అనుకోవచ్చు. ఈ కేసు విషయంలో ప్రజలకు రకరకాల కొత్త అనుమానాలు పుట్టుకొచ్చినా ఎవ్వరూ చేయగలిగిందేమీ లేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles