వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన సోదరుడు వైఎస్ భాస్కర్ రెడ్డి దరఖాస్తు చేస్తున్న బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. వైయస్ భాస్కర్ రెడ్డి కడప జిల్లాలో చాలా కీలకమైన, బలవంతమైన నాయకుడు అని- ఆయన జైలు బయట ఉండడం వలన సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం పుష్కలంగా ఉన్నదని సిబిఐ న్యాయవాదులు కోర్టు ఎదుట తమ వాదనలు వినిపించారు. భాస్కర్ రెడ్డి విచారణ ఇప్పటికే పూర్తయిందని, మళ్లీ విచారణ అవసరం వచ్చినా ఆయన సహకరిస్తారని, జెయిలులోనే ఉంచి విచారించాల్సిన అవసరం లేదని భాస్కర్ రెడ్డి తరఫున న్యాయవాదులు వాదించారు. అయితే కోర్టు చివరికి సిబిఐ వాదనల వైపే మొగ్గు చూపింది. భాస్కర రెడ్డి బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.
హైకోర్టు తాజా నిర్ణయంతో సరికొత్త వివాదం తెరమీదకు వస్తోంది. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇద్దరూ సమానంగా నిందితులు. ఇద్దరికీ హత్యలో భాగస్వామ్యం ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ వారి పాత్ర ఉన్నదని సిబిఐ అభియోగాలు మోపుతోంది. అయితే అవినాష్ రెడ్డికి హైకోర్టు కొన్ని రోజుల కింద ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఆయనకు కస్టోడియల్ విచారణ అవసరం లేదని హైకోర్టు అభిప్రాయ పడింది. ఆ తర్వాత ప్రతి శనివారం విచారణకు వచ్చే ప్రక్రియలో భాగంగా అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేయడము ఆ వెంటనే బెయిల్ పై విడుదల చేయడం కూడా జరిగిపోయింది. అవినాష్ తండ్రి భాస్కర రెడ్డి దాఖలు చేసిన బయలు పిటిషన్‌ను మాత్రం తాజాగా తిరస్కరించారు.
ఇప్పుడు సామాన్యులకు కలుగుతున్న సందేహం ఏంటంటే.. బయట ఉండడం వలన సాక్షులను ప్రభావితం చేయగలరనే అనుమానంతో భాస్కర్ రెడ్డికి బయలు తిరస్కరించినప్పుడు అదే సిద్ధాంతం తండ్రి కంటే పెద్ద నాయకుడు స్వయంగా ఎంపీ కూడా ఆయన అవినాష్ రెడ్డికి ఎందుకు వర్తించదు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇదే కోణంలో గమనించినప్పుడు అవినాష్ కు బెయిలు మంజూరు చేయడం కూడా కరెక్ట్ కాదు కదా అనే వాదన వస్తుంది. కడప ఎంపీ కూడా అయిన అవినాష్ రెడ్డి బయట ఉండడం వలన, తండ్రి కంటె ఎక్కువగా సాక్షులను ప్రభావితం చేయగలరు కదా.. అనే వాదన ఉంది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోసం ఆల్రెడీ వైఎస్ వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు. ఆ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వస్తాయని, ఖచ్చితంగా అవినాష్ కు మంజూరైన బెయిలు రద్దవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.
కొడుకు కంటే తండ్రి బలవంతుడా?
Monday, December 23, 2024