ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ అంటే ఎంతో అరుదైన గౌరవం. ఆషామాషీ కాదు.ఇప్పుడు భారత క్రికెట్ జట్టు ఆ అరుదైన గౌరవాన్ని సాధించే ముంగిట్లో ఉంది. కొంచెం జాగ్రత్త, కొంచెం కష్టపడితే చాలు.. చాంపియన్ షిప్ మనదే అవుతుంది. మన భారత జట్టు ప్రపంచ టెస్టు గండరగండలు అనిపించుకుంటుంది. కానీ మన బ్యాటర్లు ముంచుతారా? తేల్చుతారా? అనే టెన్షన్ యావత్ భారత క్రీడాభిమానుల్లో ఇప్పుడు కనిపిస్తోంది.
ఓవల్ మైదానంలో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ తుది సమరంలో ఆస్ట్రేలియా-భారత్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ అయిదో రోజుకు చేరుకుంది. అనూహ్య పరిణామాల మధ్య భారత్ ఎదుట ఇప్పుడు 280 పరుగుల లక్ష్యం మిగిలిఉంది. మూడు వికెట్లు ఆల్రెడీ మన జట్టు కోల్పోయింది. ప్రస్తుతానికి క్రీజులో విరాట్ కొహ్లి, ఆజింక్య రహానె ఉన్నారు. భారత్ ను ఏ తీరాలకు చేరుస్తారనేది ప్రస్తుతం వీరి చేతుల్లో ఉంది. ప్రస్తుతం చేతిలో ఉన్న ఏడు వికెట్లను కాపాడుకుంటూ అయిదో రోజు ఆట ముగిసే వరకు భారత్ ఆట సాగదీసినా కూడా చాలు. మ్యాచ్ డ్రా గా ముగిసిందంటే.. ఉభయ దేశాలను ఉమ్మడిగా టెస్టు ఛాంపియన్ గా ప్రకటిస్తారు. కానీ.. 280 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే మాత్రం రికార్డు అవుతుంది.
ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ తుదిపోరులో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ను ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 469 పరుగుల భారీ స్కోరుకు జవాబుగా భారత్ కేవలం 296 పరుగులకు ఆలౌట్ అయింది. ఫాలో ఆన్ ప్రమాదం తప్పింది గానీ ఓటమి భయం పొంచి ఉంది. రెండో ఇన్నింగ్స్ ను నాలుగోరోజు మూడోసెషన్ వరకు ఆడిన ఆస్ట్రేలియా అప్పటికి 8 వికెట్ల నష్టానికి 270 పరుగులుచేసి డిక్లేర్ చేసింది. ఆ సమయానికే భారత్ ముందున్న లక్ష్యం 444 పరుగులు. మిగిలిఉన్న మూడో రోజు ఆటలో 40 ఓవర్లు మాత్రం ఆడిన భారత్ మూడు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. చివరిరోజు ఆటకు 270 పరుగుల లక్ష్యం మిగిలింది.
మొదటి ఇన్నింగ్స్ లో 31 బంతులు ఆడి కేవలం 14 పరుగులకు అవుట్ అయిన విరాట్ కొహ్లి రెండో ఇన్నింగ్స్ లో కాస్త మెరుగైన ప్రదర్శన చేస్తుండడం భారత క్రీడాభిమానులకు కాస్త ఆశ పుట్టిస్తోంది. అలాగే మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బౌలర్లకు కొరుకుడు పడకుండా 89పరుగులతో సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడిన ఆజింక్య రహానే కూడా క్రీజులో ఉన్నాడు. వీరిద్దరు తొందరగా అవుట్ కాకుండా ఇన్నింగ్స్ ను ముందుకు నడిపిస్తే అద్భుతం జరగవచ్చు. రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ ల మీద కూడా ఆశలున్నాయి.ఒకరోజులో 280 పరుగుల లక్ష్యం మరీ ఎక్కువ కాదు. కానీ అదంతా కూడా ఆస్ట్రేలియా బౌలర్లను మనం ఎంత మేర నియంత్రించగలం అనేదానిమీదనే ఆధారపడి ఉంటుంది.
కొంచెం కష్టపడితే చరిత్ర సృష్టించవచ్చు!
Monday, December 23, 2024