రాను రాను అధికార పార్టీలో అసహనం పెరుగుతోంది. ప్రభుత్వం మీద వీసమెత్తు విమర్శ వస్తే చాలు.. అలా మాట్లాడిన వారిపై ఎడాపెడా విరుచుకుపడిపోవడం అనేది చాలా సాధారణమైన సంగతి. అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు.. విమర్శలు చేసే వారిమీద పోలీసు కేసులు బనాయించడం అరెస్టు చేసి వారిని ఇబ్బందులకు గురిచేయడం అనేది ఒక రెగులర్ ప్రాక్టీస్ గా మార్చుకుంది. అందుకోసం కొత్త చట్టాలు కూడా తెచ్చింది. సోషల్ మీడియాలో చిన్న పోస్టులు పెట్టినా చాలు.. ఎడా పెడా వారి మీద కేసులు నమోదు అయిపోతున్నాయి.
అయితే తాజా సంఘటనల్ని గమనిస్తోంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసహనం కూడా అప్డేట్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. విమర్శించిన వారి మీద కేసులు పెట్టడం సంగతి అటుంచి.. వారిమీద దాడులకు దిగుతున్నారా? అనిపిస్తోంది. చెదురుమదురుగా పార్టీల గురించిన విమర్శల్లో ఎక్కడైనా తగాదాలు, దాడులు జరగడం మామూలే. కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడి మీద బహిరంగంగా పట్టపగలే దాడి జరగడం, కొట్టడానికి ప్రయత్నించడం అనేవి సీరియస్ అంశాలుగా ప్రజలు పరిగణిస్తున్నారు.
నెల్లూరు జిల్లాలోని తెలుగుదేశం సీనియర్ నాయకుల్లో ఆనం వెంకటరమణారెడ్డి కూడా ఒకరు. అలాగే ఆ జిల్లా నుంచి జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని చాలా గట్టిగా విమర్శించే నాయకుడు కూడా. జగన్ ను గానీ, ఆయన అనుచరులను గానీ ఏమాత్రం ఖాతరు చేయకుండా.. వెంకటరమణారెడ్డి నిశిత విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు. కేవలం జగన్ మీదనే కాదు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొడాలినాని దగ్గరినుంచి రోజా వరకు ఎవరు మాటతూలినా సరే.. వారికి ఒక రేంజిలో కౌంటర్లు ఇవ్వడంలో ఆనం వెంకటరమణారెడ్డి పెట్టింది పేరు. ఆయన ప్రెస్ మీట్లలో, యూట్యూబ్ వీడియోల్లో విరుచుకుపడుతుంటారు.
అలాంటి ఆనంపై ఇవాళ దాడి జరిగింది. ఆర్టీఏ కార్యాలయం నుంచి ఆయన వస్తుండగా.. సుమారు పదిమంది బైక్ లపై వచ్చి ఆయన మీద కర్రలతో దాడికి యత్నించారు. ఈలోగా ఆనం అనచరులు, తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకోవడంతో దుండగులు అక్కడినుంచి పరారయ్యారు.
ఈ దాడి అనేది జగన్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో పెరుగుతున్న అసహనానికి, అసమర్థతకు నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అసలే తెలుగుదేశం మేనిఫెస్టోకు దక్కుతున్న ప్రజాదరణతో ఓర్వలేకపోతున్న వైసీపీ కార్యకర్తలు, ఇలా సీనియర్ నాయకుల మీద దాడులకు తెగబడడం అనేది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
కేసులు పాయె.. దాడులు వచ్చె.. టాంటాంటాం!!
Sunday, December 22, 2024