కేసీఆర్ హ్యాండిచ్చాక.. మోడీ వైపు చూస్తున్నారు!

Saturday, January 18, 2025

కర్ణాటక ఎన్నికల్లో ఆశించినన్ని సీట్లు సాధించలేక, అధికారం గురించి బేరసారాలు చేయలేని దుస్థితిలో ఆగిపోయిన జేడీఎస్ ఇప్పుడు కమలదళం వైపు దృష్టిసారిస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒదిశా రైలు దుర్ఘటన అనంతర పరిణామాలలో విపక్ష పార్టీలన్నీ నిందలు మొత్తం కేంద్రంలోని బిజెపి మీద వేస్తుండగా, కేంద్రాన్ని బాధ్యత వహించేలా చేయడానికి ప్రయత్నిస్తుండగా.. జేడీఎస్ కురువృద్ధుడు దేవెగౌడ మాత్రం కేంద్రాన్ని ప్రశంసించడం ఈ సందర్భంగా చర్చనీయాంశం అవుతోంది.
రైలు ప్రమాదం తర్వాత పలు రాజకీయ పార్టీలు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ రాజీనామాకు డిమాండ్ చేశాయి. అయితే, ఆ ప్రమాదం నేపథ్యంలో అశ్వనీ వైష్ణవ్ స్పందించిన తీరు, ప్రమాద స్థలంలో దగ్గరుండి పనులు జరిపించిన తీరు లాంటివి.. కేవలం బిజెపి అనుకూల పార్టీలనుంచి మాత్రమే కాకుండా.. చాలామంది నుంచి ప్రశంసలు అందుకున్నాయి. ఇటీవలి ఎన్నికల్లోనే బిజెపి మీద తలపడిన జేడీఎస్ దేవేగౌడ కూడా రైల్వే మంత్రి కష్టాన్ని కొనియాడడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
విపక్ష కూటమి నిర్వహిస్తున్న సమావేశాలకు కూడా దేవెగౌడ దూరంగానే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన నెమ్మదిగా జేడీఎస్ ను కమలదళంవైపు నడిపిస్తున్నారనే పుకార్లు వస్తున్నాయి. గతంలో కూడా వీరి మధ్య అధికార పంపిణీ ఒప్పందంతో బంధం కుదిరింది గానీ అది నిలబడలేదు. ఈసారి వీరు వచ్చినంత మాత్రాన కమలం ఎంత మేర నమ్ముతుందనేది ప్రశ్నార్థకం.
అయితే.. మరో కోణంలోంచి గమనించినప్పుడు.. జేడీఎస్ కుమారస్వామిలో అనేక రకాల ఆశలు రేపిన భారాస సారథి, తెలంగాణ సీఎం కేసీఆర్ వారికి హ్యాండివ్వడం వల్లనే వారిప్పుడు బిజెపి వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.కేసీఆర్ భారాస పేరుతో జాతీయ పార్టీ హడావుడి ప్రారంభించినప్పటినుంచి కుమారస్వామి ఆయన వెంట ఉన్నారు. కేసీఆర్ పెట్టిన ప్రతి మీటింగుకు బెంగుళూరు నుంచి వచ్చి ఆయనకు ఒక శాలువా కప్పి, పూల బొకే ఇస్తూ వచ్చారు. కేసీఆర్ కూడా.. కన్నడ ఎన్నికల్లో జేడీఎస్ కు అనుకూలంగా భారాస శ్రేణులు ప్రచారం చేస్తాయని ప్రకటించారు. కుమారస్వామికి ఎన్నికల ఖర్చుల నిమిత్తం భారీగా ఆర్థిక సాయం అందించేందుకు కూడా మాట ఇచ్చినట్టు పుకార్లు వ్యాపించాయి. ఆర్థికసాయం కాదు కదా.. అక్కడి ఎన్నికల్లో కేసీఆర్ , జేడీఎస్ కోసం కనీసం మాటసాయం కూడా చేయలేదు. ఆ పార్టీ కూడా అక్కడ కలలు చెదిరి కుప్పకూలింది. ఇప్పట్లో మళ్లీ అధికారం దాకా పార్టీని నడిపించడం అసాధ్యం అనే ఉద్దేశంతోనే బిజెపితో మైత్రికి మళ్లీ తహతహ లాడుతున్నట్టు తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles