కేసీఆర్ ప్రేమ : ఎంత నిజం? ఎంత అబద్ధం?

Sunday, January 19, 2025

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రెవేటీకరించాలనే కేంద్రం ఆలోచనపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు భగ్గుమన్నారు. కేంద్రం దుర్మార్గానికి పాల్పడుతోందని విమర్శలు గుప్పించారు. ఎటూ కేంద్రంలోని బిజెపి మీద పోరాడడానికి, వారి తప్పులను ఎత్తీ చూపించడానికి ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకోకుండా పోరాడుతున్నారు కదా అనే ఉద్దేశంతోను, అదే సమయంలో, భారాస జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత.. ఏపీలో రాజకీయం చేయడానికి ఇది ఒక అవకాశంగా మలచుకోగలరనే ఉద్దేశంతోనూ.. విశాఖ ఉక్కుపై ఆయన కనబరుస్తున్న ప్రేమను అందరూ నిజమే అనుకున్నారు. కానీ.. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) విడుదల చేసిన ప్రకటనకు ఆసక్తి వ్యక్తీకరించడానికి సంబంధించి గడువు ముగిసిపోయినా కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి బిడ్ లు దాఖలు కాలేదు. దీంతో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రెవేటీకరణ అనే అంశంపై పెద్దపెద్ద మాటలు మాట్లాడిన తెలంగాణ సర్కారు, కేసీఆర్ ల ప్రేమ నిజమేనా? అబద్ధమా? అనే అభిప్రాయాలు పలువురికి కలుగుతున్నాయి.
విశాఖ ఉక్కును తెలంగాణ కొంటుందని కేసీఆర్ ప్రకటించిన తర్వాత.. రాజకీయాల్లో కొంత వేడి పుట్టింది. దానికి తగినట్టుగానే సింగరేణి కాలరీస్ కు సంబంధించిన డైరక్టర్లు విశాఖ వెళ్లి అక్కడ ప్లాంటును పరిశీలించి, అక్కడి అధికారులతో సమావేశమై వివరాలు కూడా తెలుసుకుని వచ్చారు. పైగా ఆర్ఐఎన్ఎల్ వారి బిడ్ లోనే ఏ కంపెనీ అయినా ఇనుప ఖనిజం, బొగ్గు లేదా డబ్బు ఎడ్వాన్సుగా ఇస్తే తక్కువ ధరకు స్టీలు తిరిగి ఇస్తామనే ప్రతిపాదనతో బిడ్లను పిలవడంతో.. సింగరేణి మరింత ఉత్సాహంగా పాల్గొంటుందని అంతా అంచనా వేశారు.
నిజానికి ఈ బిడ్లకు 15వతేదీ గడువు తేదీ కాగా, సింగరేణి తమకు మరికొంత సమయం కావాలని పేర్కొంది. తర్వాత మరో ఐదు రోజులు గడువు పొడిగించారు. ఆ గడువు ముగిసినా కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి గానీ, సింగరేణి తరఫు నుంచి గానీ బిడ్లు దాఖలు కాలేదు.
విశాఖ ఉక్కును కేసీఆర్ మాత్రమే ఉద్ధరించగలరన్నట్టుగా మద్యలో భారాస నాయకులు ప్రచారం చేసుకున్నారు. ప్రెవేటీకరణ ఆగినట్టుగా పుకార్లు వచ్చినప్పుడు.. కేసీఆర్ దెబ్బకు జడిసి ఆపేసినట్లుగా కూడా చెప్పుకున్నారు. విశాఖలో ర్యాలీలు కూడా తీసి తమ బీఆర్ఎస్ ప్రచారానికి కూడా వాడుకున్నారు. తీరా బిడ్ల గడువు వచ్చేసరికి మొహం చాటేశారు. అందుకే కేసీఆర్ చిత్తశుద్ధిపై అందరికీ అనుమానాలు వచ్చాయి.
ఇప్పటికీ సమయం మించిపోలేదు. మే మొదటివారంలో టెండర్లు ఖరారుచేసే సమయానికి, ఆసక్తి వ్యక్తీకరణ చేయని కంపెనీలు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ మాట సింగరేణి అధికార్లు కూడా అంటున్నారు. మరి కేసీఆర్ ఈలోగా ఎలా డిసైడ్ చేస్తారో వేచిచూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles