కేసీఆర్ దోస్తులు వారికి అంటరానివాళ్లే!

Wednesday, January 22, 2025

ఇండియా పేరుతో ఏర్పాటు అయిన విపక్ష కూటమి బెంగుళూరు సమావేశానికి తమ పార్టీని, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ని ఆహ్వానించకపోవడం పట్ల ఆ పార్టీ అధికార ప్రతినిధి వారిస్ పథాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేం వారికి అంటరాని వాళ్లమేమో.. అని ఒవైసీ వ్యాఖ్యానించడం విశేషం. నిజానికి తెరవెనుక పుకార్లు ఎలా ఉన్నప్పటికీ.. భారతీయ జనతా పార్టీని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీల్లో మజ్లిస్ కూడా ఉంటుంది. అయితే.. చిన్నాచితకా పార్టీలను కూడా పిలిచిన విపక్షాల కూటమి నేతలు మజ్లిస్ ను మాత్రం పక్కన పెట్టడానికి కారణం ఏమై ఉండవచ్చుననే విషయంలో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే మజ్లిస్ ను కూడా కాంగ్రెస్ పార్టీ విపక్షాల భేటీనుంచి దూరం పెట్టడానికి ప్రధాన కారణం కేసీఆర్ తో ఉన్న స్నేహమే అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. అధికారికంగా పొత్తు లేకపోయినప్పటికీ.. భారాస- మజ్లిస్ మధ్య బలమైన స్నేహబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ.. భారత రాష్ట్ర సమితి ఊసునే సహించలేకపోతోంది. విపక్షాల భేటీకి భారాసను పిలవడానికి వీల్లేదని తాను పట్టిబట్టినట్టుగా రాహుల్ గాంధీ ఖమ్మం సభలోనే వెల్లడించారు. భారాసను పిలిస్తే కాంగ్రెస్ పార్టీ ఆ భేటీకి హాజరు కాదని తాను ముందే చెప్పినట్లు ఆయన వెల్లడించారు. భారాస అనే పార్టీ, భారతీయ జనతా పార్టీకి బిటీమ్ అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్.. కేసీఆర్ పూర్తిగా ద్వేషిస్తోంది, దూరం పెడుతోంది! అయితే కేసీఆర్ తో ఇప్పటికీ స్నేహాన్ని కొనసాగిస్తున్న ఏకైక పార్టీ మజ్లిస్ మాత్రమే. ఆ నేపథ్యంలో మజ్లిస్ ను కూడా ముందుజాగ్రత్తగా ఇండియా కూటమి దూరం పెడుతున్నట్లుగా కనిపిస్తోంది.

కేసీఆర్ తాను భారాసను ప్రకటించడానికి పూర్వం.. జాతీయ స్థాయిలో పార్టీలను కూడగట్టడానికి అనేక రాష్ట్రాలు తిరిగారు. వారందరూ తన ప్రతిపాదనల పట్ల చాలా సుముఖంగా స్పందిస్తున్నారంటూ ఆయన అప్పట్లో చెప్పుకున్నారు. అయితే.. ఆ పార్టీలు, నేతలు అందరూకూడా ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నారు. ఉద్ధవ్, నితీశ్, హేమంత్ సోరెన్, స్టాలిన్ తదితరులందరూ ఆ భేటీలో ఉన్నారు. వారెవ్వరూ ఇప్పుడు కేసీఆర్ స్నేహహస్తాన్ని కోరుకోవడం లేదు. సొంతంగా జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత.. ఆయన వారందరినీ దూరం చేసుకున్నట్టుగా అయింది. అయితే మజ్లిస్ విషయంలో గులాబీదళంతో వారికున్న స్నేహం వల్లనే కాంగ్రెస్ దూరం పెట్టినట్టుగా కనిపిస్తోంది.

తానేమీ భారాసకు మిత్రపక్షం కాదని, భాజపాను చిత్తశుద్ధితో వ్యతిరేకించే పార్టీలలో తాము కూడా ఉన్నామని అసదుద్దీన్ ఒవైసీ ఇండియా కూటమిని నమ్మించగలరో లేదో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles