తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదివరలో తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి వెళితే.. ఏదో దేవుడి దర్శనం మాత్రం చేసుకుని కేవలం ఆధ్యాత్మిక చింతనలోనే తిరిగివచ్చేసేవారు. ఇప్పుడు భారాస పేరుతో ఏపీ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారు గనుక.. ఆలయంలోంచి బయటకు రాగానే అక్కడ రాజకీయాలు మాట్లాడుతున్నారు. భారాసకు చెందిన నాయకులంతా అక్కడ తాము ఏపీలో ఏం ఉద్ధరిస్తామో చెబుతున్నారు. ఏపీలో ప్రభుత్వ వైఫల్యం వల్ల.. అక్కడి ప్రజలంతా భారాసను కోరుకుంటున్నారంటూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తిరుమలలోచేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త దుమారానికి కారణం అవుతున్నాయి.
ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కెఎ పాల్ పార్టీ కూడా ఏపీలో ఉంది. ఇప్పుడు కేసీఆర్ పార్టీ కూడా వస్తుంది. ప్రజాస్వామ్యంలో పార్టీలు ఉండడం మంచిదే అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కేసీఆర్ ఈగోను హర్ట్ చేసేలా ఉన్నాయనడంలో సందేహం లేదు. ఈ మాటలు విని.. కేసీఆర్.. కెఎ పాల్ ఇద్దరూ ఒకటేనా? ఇద్దరూ సమాన స్థాయి నాయకులా అంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు.
కెఎపాల్ తన డైలాగులతో, తన మార్కు రాజకీయంతో ఎంత కామెడీ చేస్తుంటారో ప్రతి ఒక్కరికీ తెలుసు. తలచుకున్నప్పుడు ప్రతి ఎన్నికల్లో పోటీచేయడం.. ఎన్నికలు జరిగేదాకా ఎట్టి పరిస్థితుల్లో నేనే గెలుస్తున్నానను అని ప్రగల్భాలు పలకడం.. ఫలితం రాగానే, ఎన్నికల్లో మోసాలు జరిగాయని చెప్పడం కెఎ పాల్ కు అలవాటు. తెలంగాణలో ఈసారి తానే సీఎం అవుతానని ఢంకా బజాయించి ప్రకటించే కెఎపాల్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క హైదరాబాదు మినహా మొత్తం ఎంపీ సీట్లను తానే గెలుస్తానని కూడా ప్రకటిస్తుంటారు. ఇప్పుడు సజ్జల చేసిన కంపేరిజన్ విన్న తర్వాత.. దేశంలో ఎంపీసీట్లు గెలవడం గురించి గానీ.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో భారాసను విస్తరించడం గురించి గానీ.. కేసీఆర్ మాటలు కూడా అలాగే కనిపిస్తున్నాయి.
కేసీఆర్ ఏపీ విస్తరణకు సంబంధించినంత వరకు ఎక్కడా ఠికానా లేని ముగ్గురు నాయకుల్ని పార్టీలో చేర్చుకుని వాళ్లే గెలుపు గుర్రాలు అన్నట్టుగా ఏపీ రాజకీయాలను శాసిస్తానన్నట్టు పలుకుతున్న ప్రగల్భాలు ఆయనను కామెడీ పొలిటీషియన్ గా మారుస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఆయన హీరోనే.. జాతీయ రాజకీయాల్లోకి కూటమి పేరుతో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆయన మాటలకు, జాతీయ రాజకీయాల పట్ల, విధానాల పట్ల అభిప్రాయాలకు ఎంతో విలువ ఉండేది. కానీ.. సొంత పార్టీ పెట్టి.. దేశమంతా విస్తరించడం.. ఏపీలో విస్తరించడం లాంటి ప్రయత్నాల్లో చెబుతున్న మాటలే కామెడీ అవుతున్నాయి.
కేసీఆర్- కేఏపాల్ ఇద్దరూ ఒక్కటేనా?
Wednesday, January 15, 2025