కేసీఆర్ అలా చేస్తే జగన్‌కు డేంజర్ బెల్సే!

Saturday, January 18, 2025

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసేలాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారా? అనే చర్చ ఇప్పుడు ఉభయ రాష్ట్రాల ఉద్యోగ వర్గాల్లో నడుస్తోంది. ఒకవేళ ఆయన అలాంటి నిర్ణయం తీసుకుంటే.. అది ఏపీలో ముఖ్యమంత్రి జగన్ కు ప్రమాదఘంటిక మోగించినట్టేనని పలువురు అంచనా వేస్తున్నారు.

మెజారిటీ రాష్ట్రాలలో ఇప్పుడు అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలులోకి తీసుకురావాలనే డిమాండ్ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి మెడకు గుదిబండ లాగా తగులుకొని ఉన్న విషయం అందరికీ తెలిసిందే. పాదయాత్ర సమయంలో ముందూవెనుకా చూసుకోకుండా.. తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా సిపిఎస్ ను రద్దు చేసేస్తానని హామీ ఇచ్చినందుకు సీఎం జగన్ ఇప్పుడు నానాపాట్లు పడుతున్నారు. తాజాగా ఇదే డిమాండ్ తెలంగాణలో కూడా వినిపిస్తోంది. ఏపీ తరహాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు పోరాటాలు చేసి నిరసనలతో సిపిఎస్ రద్దు గురించి ప్రశ్నించేంత అవకాశం తెలంగాణ ఉద్యోగ సంఘాలకు లేదు. అక్కడివారికి సిపిఎస్ రద్దు గురించి కేసీఆర్ వైపు నుంచి ఎలాంటి హామీ కూడా లేదు. అందుకే వారు ముఖ్యమంత్రిని కలిసి ఉద్యోగులకు సంబంధించిన అనేకానేక అంశాలను వినతి పత్రాల రూపంలో సమర్పించుకుంటూ పనిలో పనిగా సిపిఎస్ రద్దు గురించి కూడా ప్రస్తావిస్తున్నారు.

తెలంగాణ ఉద్యోగ సంఘాలను ఆకట్టుకునే విధంగా త్వరలోనే పి ఆర్ సి ఏర్పాటుచేయబోతున్నట్లు కేసీఆర్ సర్కారు ఇప్పటికే ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో శాసనసభలోనే వస్తుందని తాజాగా ముఖ్యమంత్రిని కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులు ఆశిస్తున్నారు. 2023 జూలై నుంచి అమలయ్యేలాగా ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరుతున్నారు ఏపీలో జగన్మోహన్ రెడ్డి అదే తరహాలో ఆల్రెడీ పి ఆర్ సి కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణలో కూడా అప్పటినుంచి అమలయ్యేలాగానే కొత్త కమిటీ వేయాల్సి ఉంటుంది. అయితే దానిని కూడా తమ డిమాండ్లలో చేర్చి ఉద్యోగులు కోరడం అనేది మాయగా కనిపిస్తోంది. దీనితోపాటు అనేక డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లిన నాయకులు, ఆయన తమపట్ల సానుకూలంగా ఉన్నారని పి ఆర్ సి, సి పి ఎస్ లకు సంబంధించి త్వరలోనే తీపికబురు ప్రకటిస్తారని అంటున్నారు.

పిఆర్సి కమిటీ ఏర్పాటు అనేది ఎటూ జరుగుతుంది. ఉద్యోగ సంఘాలు నిజంగా కేసీఆర్ తమకు మేలు చేశారని నమ్మాలంటే సిపిఎస్ రద్దు కూడా జరగాలి. ప్రభుత్వానికి పడగల ఆర్థిక భారాన్ని పరిగణించి.. కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకుంటారో లేదో చెప్పలేం.  ఒకవేళ కెసిఆర్ సర్కారు అలాంటి నిర్ణయం తీసుకుంటే కనుక ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరింత ఇబ్బంది అవుతుంది. అక్కడి ఉద్యోగులు జగన్ మీద మరింత ఒత్తిడి పెంచుతారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles