తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు నెలల ముందుగానే ఎంఎల్ఏ అభ్యర్థులను ప్రకటించి, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాక రేపారు. అదే విధంగా ఏపీ సీఎం జగన్ చేయగలరా? ఇలా మూడు నెలల ముందుగానే ఎంఎల్ఏ అభ్యర్థులను ప్రకటించడం జగన్ కు సాధ్యం అయ్యే పనేనా.. రాజకీయం గా చాలా విషయాల్లో భావ సారూప్యత ఉండే, ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఈ ముందస్తు అభ్యర్థుల ప్రకటన తేడా చూపనుందా.. అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
1. అసంతృప్తి :
అభ్యర్థులను ప్రకటించిన తరువాత ఇప్పటివరకు కేసిఆర్ కు చెప్పుకోదగిన స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కాలేదు. కానీ జగన్ విషయంలో ఇది సాధ్యం అయ్యేలా కనపడటం లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్ ఎలాగైనా అధికారంలోకి రావాలని అన్ని నియోజకవర్గాల్లోని గ్రూపులు ఒకటై పనిచేయడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి అలా లేదు, ప్రతి నియోజకవర్గంలో కొత్త, పాత క్యాడర్ల మధ్య గొడవలే గెలుపు పై ప్రభావం చూపే స్థాయిలో ఉన్నాయి. ఉదా: ఒంగోలు లో బాలినేని శ్రీనివాసరెడ్డి, వై వి సుబ్బారెడ్డి లో మధ్య గొడవలే ఉమ్మడి ఒంగోలు జిల్లా వ్యాప్తంగా పార్టీ కొంప ముంచుతాయని టాక్ వినిపిస్తోంది. చిత్తూరు జిల్లా లో రోజా – రెడ్డి వారి చక్రపాణి రెడ్డి మధ్య గొడవలు మంత్రి పెద్దిరెడ్డి – ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి లాంటి గొడవలు చాలానే ఉన్నాయి.. ఒక్క జిల్లా అనుకోవడం కంటే ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు యధేచ్ఛగా పార్టీ ని దెబ్బ తీసే స్థాయికి చేరుకున్నాయి.
2. వలస ఎమ్మెల్యేల బెడద
ఈ విషయం లో తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు అనే చెప్పవచ్చు. తాండూరు, భూపాలపల్లి, స్టేషన్ ఘనపూర్ లాంటి చోట్ల విపరీతంగా పోటీ ఉన్నా..ఏ మాత్రం వివాదం తలెత్తకుండా చేయగలిగారు.
ఇక జగన్ విషయానికి వస్తే, టిడిపి నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసిపి మద్దతు గా ఉన్నారు. చీరాలలో ఎంఎల్ఏ కరణం బలరాం.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ల మధ్య వివాదం ఇప్పటిలో చల్లారే పరిస్థితి కనపడటం లేదు. గన్నవరం లో అయితే వైసిపి లోకి వచ్చిన టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి, వైసిపి పార్టీకి గత ఎన్నికల్లో పోటీ చేసిన వైసిపి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఝలక్ ఇచ్చి, ఏకంగా టిడిపి అభ్యర్థి అయిపోయారు. ఇక వైసిపి లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, వైజాగ్ సౌత్ వాసుపల్లి గణేష్ ను వైసిపి ఎంఎల్ఏ అభ్యర్థులుగా ప్రకటిస్తే, పార్టీ పరిస్థితి దారుణం గా తయారయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇలాటి నేపథ్యంలో అసలు కేసీఆర్ తీరుగా నెలలు ముందుగా అభ్యర్థుల జాబితాలను ప్రకటించడం మాత్రమే కాదు కదా.. జాబితా ఎప్పుడు ప్రకటించినా సరే.. అసమ్మతుల బెడత జగన్ కు తలనొప్పిగా మారుతుందని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి.