కేసీఆర్‌ను జీరో చేయాలనేదే కమలదళం ప్లాన్!

Wednesday, January 22, 2025

భారత రాష్ట్ర సమితి ద్వారా ప్రధానిగా మోడీ పతనాన్ని నిర్దేశించి ఎర్రకోటపై గులాబీ జెండా రెపరెపలాడిస్తాననేది కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిజ్ఞ.  జాతీయ పార్టీగా రూపుమారినప్పటినుంచి, ఆయన కేవలం దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించే వ్యూహాత్మక వ్యవహారాల మీద మాత్రమే దృష్టి పెడుతున్నారు.  నాయకులను తమలో కలుపుకోవడం మీద శ్రద్ధ పెడుతున్నారు.  భారతీయ జనతా పార్టీ, బిఆర్ఎస్ ప్రయత్నాలను సీరియస్గా తీసుకునే వాతావరణం తయారైంది.  దానికి నిదర్శనమే తెలంగాణలోని యావత్ కమల నాయకులతో అర్జెంటుగా హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించడం. 

నిజానికి బిజెపి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల ద్వారా  ప్రభుత్వం మీద ఊరురా బురద జల్లుతూ వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది.  ఆ  సమావేశాలకు మంగళవారమే ఆఖరు.  ఆ రోజున భారీ ఎత్తున బహిరంగ సభలుగా నిర్వహించాలని ముందే ప్లాన్ చేసుకున్నారు.  అయితే హఠాత్తుగా ఢిల్లీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. తాము తలపెట్టిన కార్యక్రమాలను అర్థంతరంగా పక్కకు పెట్టేసి.. నాయకులంతా ఢిల్లీ వెళ్లారు. అమిత్ షాతో గంటన్నర పైగా సమావేశం జరిగింది. ఈ ఏడాదిలోనే జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బిజెపిని అధికారంలోకి తీసుకురావాలనే దిశా నిర్దేశం జరిగింది.

ఇప్పుడు తన ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణ మాత్రమే అని,  అక్కడ అధికారంలోకి రావడానికి నాయకులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని..  మొత్తం 119 నియోజకవర్గాలలోను బహిరంగ సభలు నిర్వహించాలని,  చిట్టచివరిగా నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ కూడా హాజరవుతారని అమిత్ షా ఒక పెద్ద రూట్ మ్యాప్ రాష్ట్ర కమల నాయకులకు అందించారు.  నిజానికి ఇది వారికి చాలా  క్లిష్టమైన విషయం.   మొత్తం అన్ని నియోజకవర్గాలలో పార్టీకి సమానంగా క్యాడర్ లేదు.  కొన్ని చోట్ల పోటీ చేయడానికి అభ్యర్థులకు కూడా గతి లేని పరిస్థితి.  అయినా సరే సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత,  అన్నిచోట్ల తమకు బలమైన అభ్యర్థులు ఉన్నారని బండి సంజయ్ జనాంతికంగా సెలవిచ్చారు.

అయితే జాతీయ రాజకీయాలలో  కెసిఆర్ ను జీరో చేయాలనేదే బిజెపి టార్గెట్ గా కనిపిస్తుంది.  ఈ ఏడాదిలోనే జరిగే అసెంబ్లీ ఎన్నికలలో..  భారాసను దారుణంగా దెబ్బ కకొట్టగలిగితే గనుక,  ఆ పార్టీ పరువు పోతుందనేది వారి నమ్మకం.  రెండుసార్లు అధికారం వెలగబెట్టిన రాష్ట్రంలోనే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయిన కేసీఆర్,  దేశ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయబోతారు..  ఆయనను ప్రజలు ఎలా నమ్మాలి..  అనే ప్రచారం ద్వారా కేసీఆర్ ప్రభావానికి గండి కొట్టాలనేది వారి ఆలోచన.   భాజపాయేతర జాతీయ పార్టీల దృష్టిలో  కేసీఆర్ కు పూచికపుల్లపాటి విలువ కూడా లేకుండా చేయాలనేది బిజెపి వ్యూహం. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు బిజెపి బిఆర్ఎస్ మధ్య గతంలో ఎన్నడూ లేనంత వాడి వేడి వాతావరణం లో జరుగుతాయని అనుకోవచ్చు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles