కేసీఆర్‌కు భలే ఇరకాటం వచ్చిపడిందే!

Wednesday, December 18, 2024

ప్రస్తుతానికి దేశ రాజకీయాలను కుదిపేస్తున్న సబ్జెక్టు కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ అద్భుత భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 28వ తేదీన ప్రారంభించబోతున్నారు. ఆరోజున సావర్కర్ జయంతి కావడం అనేది యాదృచ్ఛికమో కాదో తెలియదు గానీ.. అదే సందర్భంగా చేస్తున్నారని తొలుత ఒక వివాదం రేగింది. అంతకంటె సీరియస్ గా ఈ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభింపజేయకుండా, ప్రధాని చేతుల మీదుగా జరగడం అనేది రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధం అని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం అని విపక్షాలు అన్నీ కోడై కూస్తున్నాయి. భాజపాయేతర పార్టీలు 19 కలిసి, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని, ఆ కార్యక్రమంలో తాము పాల్గొనబోమని స్పష్టం చేసేశాయి.
అయితే ఈ పరిణామం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పెద్ద ఇరకాటమే తెచ్చిపెట్టింది. తమ పార్టీ బీఆర్ఎస్ తరఫున ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే.. ఆయనకు నిందలు తప్పవు. మాటపడక తప్పదు. ఎలాగంటే..
కార్యక్రమానికి హాజరైతే భాజపాయేతర విపక్షాలన్నీ బీఆర్ఎస్ ను తిట్టిపోస్తాయి. ఆల్రెడీ కేసీఆర్, మోడీ తో లాలూచీ రాజకీయం నడుపుతూ, బిజెపి గెలుపుకోసమే జాతీయ పార్టీ స్థాపించినట్టుగా ఒక ప్రచారం ఉంది. ఆ ప్రచారమే నిజమని ఇప్పుడు అందరూ అంటారు.
తాము కూడా బహిష్కరిస్తే ఇంకో రకం విమర్శ తప్పదు. మోడీని వ్యతిరేకిస్తున్న పార్టీలు అన్నీ కలిసి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసేసుకున్నాయి. ఈ పార్టీల్లో ఎవ్వరితోనూ కేసీఆర్ స్నేహబంధం కొనసాగించడం లేదు. ఇప్పుడు వారిలాగానే కార్యక్రమాన్ని బహిష్కరిస్తే గనుక.. విపక్ష కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ స్కెచ్ ప్రకారం కేసీఆర్ కూడా వ్యవహరిస్తున్నారనే నింద పడుతుంది. అదే సమయంలో ఇంకో ఇబ్బంది ఉంది. తెలంగాణలో సచివాలయాన్ని చాలా ఘనంగా నిర్మించిన కేసీఆర్, ఆ భవనాన్ని తన చేతులమీదుగానే ప్రారంభించారు. ఆ నిర్మాణాన్ని ముఖ్యమంత్రిగా తానే ప్రారంభించిన ఆయనకు, పార్లమెంటు భవనాన్ని ప్రధాని ప్రారంభించకూడదు అనే నైతిక హక్కు ఎక్కడ ఉంటుందని అందరూ నిందిస్తారు. కేసీఆర్ కనీసం సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నరును ఆహ్వానించ లేదు కూడా. కాబట్టి ఆయన ప్రధాని ప్రారంభించడాన్ని వ్యతిరేకించలేరు.
కేసీఆర్ తన వ్యవహార సరళి వలనే ఎటూ నిర్ణయం తీసుకోలేని ఇరకాటంలో పడిపోయినట్లుగా కనిపిస్తోంది. హాజరయ్యేది లేనిదీ రేపటికి నిర్ణయిస్తామని బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె కేశవరావు ప్రకటించడమే ఇందుకు నిదర్శనం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles