తన గులాబీ పార్టీకి పేరు మార్చి దేశాన్ని ప్రిఫిక్సుగా తగిలించి.. జాతీయ పార్టీ అనే హోదాను సాధించి ఉండవచ్చు గాక! ఎక్కడా చెల్లకుండా పోయిన ఇద్దరుముగ్గురు నాయకులను తన పార్టీలో చేర్చుకుని.. వారేదో అతిరథ మహారథులు అయినట్టుగా వారి సారథ్యంలో పార్టీ అక్కడ సంచలనాలు నమోదుచేస్తుందనే ప్రగల్భాలతో రెచ్చిపోతూ ఉండవచ్చు గాక! తెలంగాణ ఆవిర్భావం కోసం ఏపీలో గుడులకు మొక్కానంటూ, సర్కారు సొమ్ములతో కోట్లు విలువైన కానుకలను తీసుకెళ్లి అక్కడి దేవుళ్లకు సమర్పించి ఉండవచ్చు గాక. తన యజ్ఞయాగాదులకు సూత్రధారులు గనుక.. అక్కడి స్వాములకు పాదనమస్కారాలు చేస్తుండవచ్చు గాక.. కానీ, తెలంగాణ జాతిపిత గా వందిమాగధులతో కీర్తింపజేసుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఎదురుగా నిల్చోవడానికి, రాజకీయ పార్టీ పేరుతో ఆ రాష్ట్రంలో అడుగుపెట్టడానికి అసలు అర్హత ఉన్నదా? అనే అభిప్రాయం ఇప్పుడు అక్కడి ప్రజల్లో వ్యక్తం అవుతోంది.
తెలుగురాష్ట్రం విడిపోకూడదని ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు నూటికి నూరుశాతం కోరుకున్నారు. పోరాడారు. బలిదానాలు కూడా చేశారు. ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకున్నారు. కానీ, తెలంగాణ ప్రజల సెంటిమెంటును కూడా పట్టించుకోవాల్సిందే. వాళ్లు ప్రత్యేక రాష్ట్రం బలంగా కోరుకున్నారు. ఆ కోరికను సాధారణ పోరాటం ద్వారా నెరవేర్చుకోవచ్చు. కానీ.. ఆ పోరాటానికి ఏపీ ప్రజల మీద ద్వేషబీజాలను నాటడమే తన ఎజెండాగా పెట్టుకున్నారు కేసీఆర్. తెలంగాణ ప్రజల హృదయాల్లో ఏపీ వారి మీద విషాన్ని నింపారు. ఇలాంటి దుర్మార్గం చేయకుండా కూడా.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవచ్చు. కానీ.. ఆయన ఇలాంటి విషపూరిత మార్గాన్నే ఎంచుకున్నారు. తెలంగాణలో నివసించే ప్రతి సీమాంధ్రుడూ ఒక దశలో ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ పరిస్థితిని కేసీఆర్ కల్పించారు. కొన్ని వేల కుటుంబాలు హైదరాబాదు నగరంలో ఉండడానికి భయపడి, భవిష్యత్తు భయవిహ్వలంగా ఉంటుందనే చింతతో.. ఉన్న ఆస్తులను అయిన కాడికి అమ్మేసుకుని.. తిరిగి తమ సొంత ప్రాంతాలకు ఉన్నపళంగా వలస వెళ్లిపోయారంటే.. అందుకు కేసీఆర్ కారణం.
విభజన తర్వాత విభజన సమస్యలు ఇప్పటిదాకా పరిష్కారం కాకపోవడానికి, విభజన సమస్యలు ఏమీ తేల్చకుండానే , జగన్ సర్కారు ఏర్పడిన తర్వాత.. ఆయనను ప్రలోభ పెట్టి తెలంగాణకు కావాల్సిన మేర ఒప్పందాలు చేసుకోవడానికి తెగించిన వైనం మొత్తం పక్కన పెట్టండి. విభజన సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఇప్పటికీ కేంద్రాన్ని దేబిరిస్తోందనే సంగతి కూడా పక్కన పెట్టండి.
కానీ ఏపీ ప్రజల మీద వేసిన నిందలు, ఆ తిట్లను ప్రజలు ఎలా మర్చిపోతారు. అలాంటి ప్రజల ఎదుటకు కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని రాగలరు? అసలు ఏపీలో అడుగుపెట్టే నైతిక అర్హత ఉన్నదని ఆయన ఎలా అనుకుంటారు?
కేసీఆర్‌కు ఏపీలో అడుగుపెట్టే నైతిక అర్హతఉందా?
Tuesday, November 26, 2024