అందమైన విశాఖ సాగర తీరంలో సాగుతున్న జగన్ ప్రభుత్వపు విధ్వంసహేల.. ఇప్పుడు జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాను అక్కడకు రాజధాని తరలించడం అంటూ జరిగితే, తాను నివాసం ఉండడం కోసం.. జగన్ ఏకంగా ఒక కొండనే స్వాహా చేసేస్తున్నారనే మాట ప్రచారంలోకి వస్తున్న కొద్దీ జనం నివ్వెరపోతున్నారు. సాగరతీరంలోని అందమైన రుషికొండనుర ఎంత ఘోరంగా జగన్ సర్కారు సర్వనాశనం చేసేస్తున్నదో మీడియాలో వస్తున్న ఫోటోల్లో చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు.
పర్యాటక శాఖ భవనాల కోసం అనే మిష మీద రుషి కొండలో కొంత మేర తవ్వకాలు జరిపి.. భవనాలుకట్టుకోడానికి రాష్ట్రప్రభుత్వం వివిధ శాఖలకు దరఖాస్తు చేసుకుంది. అటవీ, పర్యావరణ అనుమతులన్నీ వచ్చాయి. అయితే 9.88 ఎకరాల మేర తవ్వకాలు చేయడానికి మాత్రమే అనుమతులు వచ్చాయి. ఫోటోలలో చూస్తే రుషికొండను సాంతం కబళించేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి.. వివాదం తారస్థాయికి చేరిన తర్వాత.. ప్రభుత్వం కోర్టు ముందు నిజాలు చెప్పాల్సి వచ్చింది. అప్పటికీ సగం దాచుతూ.. నాలుగు ఎకరాల మేర అదనంగా తవ్వేసినట్టు ఒప్పుకుంది. అంత ఘోరమైన తప్పిదానికి ప్రభుత్వం ఎలా పాల్పడుతుందో అర్థం కాని సంగతి.
ప్రభుత్వం వైఖరిపై ఆగ్రహించిన హైకోర్టు రుషికొండ తవ్వకాలపై వాస్తవాలను తెలుసుకునేందుకు కేంద్ర బృందం వచ్చి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని పురమాయించింది.ఇప్పుడు సాక్షాత్తూ ప్రధానమంత్రే విశాఖకు వచ్చారు. ఎంత ఘోరం జరుగుతున్నదో స్వయంగా చూసే ఉంటారు. వాయుమార్గంలోనే వచ్చిన ప్రధానికి.. సముద్ర తీరాన ఉన్న రుషి కొండ ఎంత ఘోరంగా తయారైపోయిఉన్నదో కనిపించకుండా ఉండదు. విధ్వంసాన్ని ఇష్టపడని వ్యక్తి అయితే ఆయన మనసు క్షోభించకుండా ఉండదు.
రుషికొండను పరిశీలించడానికి తెలుగుదేశం, కమ్యూనిస్టులు, ఇలా ఎవరు వెళ్లాలని ప్రయత్నించినా సరే.. అటువైపు అడుగుకూడా పెట్టనివ్వకుండా.. వేలమంది పోలీసులను మోహరిస్తూ ప్రభుత్వం హడావుడి చేస్తుంటుంది. అక్కడ పోలీసు అవుట్ పోస్టు కూడా పెట్టేసింది. ఈగ కూడా అటు రాకుండా కట్టడి చేస్తోంది. అక్కడేదో రహస్య భూగర్భ నిధి నిక్షేపాలు తవ్వుతున్నంత బిల్డప్ ఇస్తోంది. మరి ఇప్పుడు కేంద్ర బృందం వస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది. వారిని ఎలా మానిప్యులేట్ చేయగలుగుతుంది? అదనంగా తవ్వాం అని సర్కారే చెబుతుండగా.. ఈ తప్పిదాన్ని ఎలా కవర్ చేసుకుంటారు? అర్థం కావడం లేదు.