కెసిఆర్ తాయిలం.. జగన్ బాటలోనే!

Wednesday, January 22, 2025

పేరివిజన్ కమిటీ వారి గత నివేదికల ప్రకారం పెంచిన వేతనాలకు సంబంధించి ఉద్యోగులకు లబ్ధి, ప్రయోజనాలు ఇంకా పూర్తిగా అందనేలేదు. పాత పిఆర్సి బెనిఫిట్స్ పూర్తిగా ఇవ్వనేలేదంటూ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికలు ముంచుకు వస్తున్న సమయంలో ఈ ఉద్యోగులను ఒకింత ఊరడించడానికా అన్నట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెండవ పిఆర్సిని ప్రకటించారు. రెండవ పిఆర్సి త్వరలోనే ఏర్పాటు అవుతుందని, ఏర్పాటు అయిన నాటి నుంచి ఉద్యోగులందరికీ మధ్యంతర భృతి కూడా ఇస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఆయన తాజా నిర్ణయం అచ్చంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాటలో నడుస్తున్నట్టుగానే ఉంది.

ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ వర్గాలలో అపరిమితమైన అపకీర్తిని మూటగట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఉద్యోగులు పూర్తిస్థాయిలో జగన్ ప్రభుత్వం మీద మండిపడుతున్నారంటే అది అతిశయోక్తి కాదు. గత పిఆర్సి ఇచ్చిన నివేదికను అమలు చేయడంలో మెలికలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి అప్పటిదాకా ఉద్యోగులు పొందుతున్న మధ్యంతర భృతి కంటే తక్కువ వేతనం వచ్చేలా తొలుత నిర్ణయం తీసుకుని అత్యంత వివాదాస్పదం అయ్యారు. జగన్ నిర్ణయం రివర్స్ పిఆర్సి లాగా ఉన్నదంటూ ఉద్యోగ వర్గాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో.. జగన్ కాస్త వెనక్కు తగ్గాల్సి వచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని కారణం చెబుతూ మధ్య మార్గంగా పి ఆర్ సి ని అమలు చేశారు. పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయడం వంటి హామీలను తుంగలో తొక్కారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ వర్గాలలో జగన్ సర్కారు పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వారినందరినీ బుజ్జగించడమే లక్ష్యం అన్నట్లుగా జగన్ 12వ పిఆర్సి కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఏర్పాటు చేసిన రోజునే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కమిటీ తదనుగుణంగా నివేదిక ఇవ్వాలి అని ఆయన పేర్కొన్నారు. తద్వారా పే రివిజన్ నిర్ణయాలు తీసుకోవడంలో కమిటీ ముందరికాళ్ళకు బంధాలు వేశారు.

జగన్ పిఆర్సి కమిటీని ఏర్పాటు చేసిన కొన్ని వారాల తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా అదే పని చేస్తున్నారు. పిఆర్సి విషయంలోనే చెల్లింపులు పూర్తిగా చేయలేదంటూ ఇక్కడ కూడా ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను తగ్గించడమే లక్ష్యం అన్నట్లుగా కేసీఆర్ రెండవ పిఆర్సిని త్వరలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అయితే ఎన్నికలు ఎన్నికలకు ముందుగా ఈ రెండు పిఆర్సి కమిటీలు కూడా నివేదిక ఇచ్చే అవకాశం లేదు. కమిటీ ఏర్పాటు ద్వారా ఉద్యోగులను బుజ్జగించే ప్రయత్నం మాత్రమే ఇది అవుతుంది తప్ప, కమిటీ సిఫారసులను అమల్లోకి కూడా తీసుకువచ్చి ఉద్యోగులను మెప్పించడం అనేది ఈ ప్రభుత్వాల పదవీకాలంలో సాధ్యం కాకపోవచ్చు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles