కుర్చీ దిగిపోడానికి బండి రెడీయేనా?

Monday, September 16, 2024

రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను సుదీర్ఘ కాలం వెలగబెట్టిన తర్వాత.. సరిగ్గా ఎన్నికల సీజనుకు ముందు ఆ పదవినుంచి దిగిపోవడం అంటే.. అంత సులభమైన విషయం కాదు. ఎవ్వరికైనా బాధ కలుగుతుంది. తాను ఇన్నాళ్లు బలోపేతం చేసిన పార్టీ.. ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో.. స్వయంగా తన సారథ్యంలోనే చూసి తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. కానీ బిజెపి లాంటి జాతీయ పార్టీల్లో కేవలం కోరిక ఉంటే సరిపోదు. అధిష్ఠానం ఆశీస్సులు కూడా ఉండాలి. ఆ విషయంగా తనకు స్పష్టంగా తెలుసు గనుకనే.. బీజేపీ సారథి బండి సంజయ్ పార్టీ పదవినుంచి దిగిపోవడానికి మానసికంగా సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది.

తొమ్మిదేళ్ల పాలన గురంచి తమ గొప్పలు చెప్పుకోవడానికి హనుమకొండకు ప్రధాని నరేంద్రమోడీ వస్తున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను బండి సంజయ్ పర్యవేక్షిస్తున్నారు. అయితే మోడీ సభ జరిగే నాటికి తాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉంటానో లేదోనంటూ ఆయన తన అనుచరుల వద్ద వ్యాఖ్యానించడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

బండి సంజయ్ పట్ల పార్టీలో చాలా కాలంనుంచి అసంతృప్తి రగులుతూనే ఉంది. ఆయనకు వ్యతిరేకంగా చాలా మంది నాయకులు చాలా కాలంగా హైకమాండ్ కు పితూరీలు చెబుతూనే ఉన్నారు. అయితే ఇటీవల ఆయనతో విభేదాలు ముదిరిన ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ ల మాటలకు అధిష్ఠానం ఎక్కువ విలువ ఇచ్చిందా అనే అభిప్రాయం ఇప్పుడు పలువురికి కలుగుతోంది. బండి సంజయ్ మార్పు గురించి.. ఆ ఇద్దరు నాయకులు ఢిల్లీ పెద్దలతో భేటీ అయిన తర్వాతే.. ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది.

కిషన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ.. ఆయన పదవి తీసుకోడానికి సానుకూలంగా లేరని సమాచారం. కిషన్ తీసుకోవడం లేదు అంటేనే.. పార్టీ విజయావకాశాలమీద వారికే నమ్మకం లేదనే ప్రచారం ఒకటి మొదలైంది. అయితే బండి సంజయ్ మార్పు అనివార్యం అని అధిష్ఠానం భావిస్తే గనుక.. కిషన్ రెడ్డి కాకపోతే.. మరొక సీనియర్ నాయకుడితోనైనా ఆ స్థానం భర్తీ చేస్తారు. కానీ.. పార్టీనుంచి బయటకు, ప్రధానంగా కాంగ్రెసులోకి వలసలు జరగకుండా అడ్డుకోవాలంటే.. బండి మార్పు అవసరం అని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగని ఇన్నాళ్లు కష్టపడిన బండి సంజయ్ అలగకుండా.. కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నట్టు సమాచారం. మొత్తానికి ఈ మార్పులకు బండి కూడా రెడీయేనని పలువురు పేర్కొంటున్నారు.  

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles