కుప్పంలో తొలి బ్రేకులు.. ఇది శాంపిల్ మాత్రమే!

Thursday, November 14, 2024

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించడానికి కూడా ప్రభుత్వం విఘ్నాలను సృష్టిస్తోంది. రాజకీయ పార్టీలు నిర్వహించే సభల విషయంలో సరికొత్త నిబంధనలతో కొత్త జీవో తీసుకువచ్చిన జగన్ సర్కారు తొలిసారిగా ఆ అస్త్రాన్ని చంద్రబాబు నాయుడు మీదనే ఆయన సొంత నియోజకవర్గంలోనే ప్రయోగిస్తోంది. సభల విషయంలో ఆంక్షలు విధిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే సొంత నియోజకవర్గంలో ఆయన కదలికలు కూడా తప్పే అన్నట్లుగా ఇరుక్కున పెట్టడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఈ పరిణామాలను గమనిస్తున్న వారు ఇదంతా కేవలం శాంపిల్ మాత్రమేనని, జగన్ సర్కార్ నిరంకుశధోరణులు ముందు ముందు ఇంకా విశృంఖల స్థాయిలో కనిపిస్తాయని అంచనా వేస్తున్నారు.

రాజకీయ పార్టీలు ముందుగా అనుమతి తీసుకున్న, ఎంపిక చేసిన స్థలాలలో మాత్రమే సభలు నిర్వహించాలని..  రోడ్లమీద నిర్వహించడానికి వీల్లేదని ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఒక అర్ధరాత్రి చీకటి జీవోను సరికొత్తగా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యంలో పార్టీల గొంతు నొక్కడానికి జరుగుతున్న దుర్మార్గమైన ప్రయత్నంగా ఈ జీవోను అందరూ విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు సభల్లో, పోలీసు పరంగా భద్రతా ఏర్పాట్ల వైఫల్యం వలన జరిగిన దుర్ఘటనలను సాకుగా చూపిస్తూ ఇలాంటి అనైతికమైన జీవో తేవడం సరికాదని గర్హిస్తున్నారు. ఇదిలా ఉండగా సర్కారు ఆ జీవోను తొలిసారిగా చంద్రబాబు మీదనే ప్రయోగించడం విశేషం.

‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాలలో భాగంగా రాష్ట్రమంతా పర్యటిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనను ప్లాన్ చేసుకున్నారు. బుధవారం నుంచి ఈ సమావేశాలు జరగనున్నాయి. అయితే సోమవారం అర్ధరాత్రి తరవాత వచ్చిన జీవో కాపీని పట్టుకుని, మంగళవారం పోలీస్ అధికారులు కత్తి దూశారు! కుప్పం నియోజకవర్గంలో స్థానిక తెలుగుదేశం నేతలు, చంద్రబాబు పీఏ మనోహర్ తదితరులను స్టేషనుకు పిలిపించి సమావేశాలు నిర్వహించడానికి ముందస్తు అనుమతులు తీసుకోవాలని, రోడ్డు షోలను అనుమతించేది లేదని తెగేసి చెప్పారు. రోడ్డుషోలు అక్కర్లేదని స్థానిక ఎమ్మెల్యే గనుక గ్రామాలలో సొంత ప్రజలతో సమావేశాలు మాత్రమే ఉంటాయని టిడిపి నాయకులు రాతపూర్వకంగా చెప్పినప్పటికీ వాటిని కూడా పోలీసులు తిరస్కరించడం విశేషం.

అయితే చంద్రబాబునాయుడు మాత్రం.. తన షెడ్యూలు  ప్రకారమే కుప్పం నియోజకవర్గం కార్యక్రమాలని కొనసాగించాలని నిర్ణయించడం గమనార్హం. దీంతో ఆయన పర్యటన మొదలు కాగానే.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉన్నదని అంచనాలు సాగుతున్నాయి. 

చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో కదలికలను కూడా అడ్డుకుంటూ ఆంక్షలు విధిస్తున్న జగన్ ప్రభుత్వం ఈ వైఖరిని శాంపిల్‌గా రుచి చూపిస్తుంది పలువురు భావిస్తున్నారు. ముందు ముందు నారా లోకేష్ పాదయాత్ర, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర జరిగే సందర్భాలలో ఇలాంటి ఆంక్షలు మరింత ఘోరంగా అమలులోకి తెస్తారని కూడా అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక గళం ప్రజల ఎదుట వినిపించకుండా తొక్కి పట్టడమే ప్రభుత్వ వైఖరిగా కనిపిస్తోందని అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles