వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున.. పిలకతిరుగుడు లాజిక్కులతో ప్రత్యర్థుల మీద విరుచుకుపడాలంటే ఆ పార్టీకి ఉన్న ప్రధాన వక్త అంబటి రాంబాబు. నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ఆ మంత్రిత్వ శాఖలో ఆయన సాధించిన ఘనత ఏమిటో ఆయనకైనా తెలుసో లేదో గానీ.. ప్రత్యర్థుల మీద విమర్శలు గుప్పించమంటే మాత్రం.. పంతులుగారు ప్రవచనాలు చెప్పినంత శాస్త్రోక్తంగా ఆయన మాటలగారడీతో విరుచుకుపడుతుంటారు. అలాంటి అంబటి రాంబాబు.. సత్తెనపల్లిలో తనను ఓడించడానికి చంద్రబాబునాయుడు కుట్ర చేస్తున్నారని కొత్త పాట అందుకున్నారు.
కుట్రలో భాగంగానే.. కొత్తగా తెలుగుదేశంలో చేరిన కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించారనేది ఆయన మాట! కన్నా వంటి వస్తాదును తెచ్చి తనను ఓడించాలని అనుకుంటున్నారని, కన్నా ఉడత ఊపులు తన ఎదుట పనిచేయవు అని అంబటి రాంబాబు సెలవిస్తున్నారు.
అంతా బాగానే ఉంది గానీ.. అసలు ‘కుట్ర’ అనే పదానికి అంబటికి అర్థం తెలుసా? అని ప్రజలు విస్తుపోతున్నారు. ఎందుకంటే.. బిజెపి నుంచి వచ్చి తమ పార్టీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణను , చంద్రబాబునాయుడు తమ అభ్యర్థిగా సత్తెనపల్లి నుంచి పోటీచేయించాలని అనుకుంటే అది కుట్ర ఎలా అవుతుంది. అది కేవలం చంద్రబాబు వ్యూహం మాత్రమే అవుతుంది. ఒక రహస్యమైన ఎత్తుగడ, బయటకు తెలియనివ్వని, పొడ చిక్కనివ్వని ఆలోచనలతో ఎదుటి వ్యక్తిని దెబ్బకొట్టాలని అనుకున్నప్పుడు మాత్రమే దానిని మనం కుట్ర అని అనగలం. చంద్రబాబు ఓపెన్ గా అంబటిపై ప్రత్యర్థిని ప్రకటిస్తే.. దానిని కుట్రగా భావించడంలో అంబటి తెలివితేటలు బయటపడుతున్నాయి.
అలాగని అంబటికి వ్యతిరేకంగా, ఆయనను ఓడించడానికి కుట్ర జరగడం లేదని కూడా అనలేం. ఎందుకంటే.. ఆయన సొంత పార్టీలోనే ఆయనకు గోతులు తవ్వుతున్నారు. అంబటికి మళ్లీ సత్తెనపల్లి టికెట్ ఇస్తే గనుక ఓడించి తీరుతాం అంటూ.. ఆ నియోజకవర్గానికి చెందిన కీలక వైసీపీ నాయకులు బహిరంగంగానే సభలు పెట్టి మరీ హెచ్చరిస్తున్నారు. అలాంటి వైసీపీ నాయకులకు అధిష్ఠానం నుంచి ఆశీస్సులు, అండదండలు దక్కుతున్నాయనే ప్రచారం కూడా ఉంది. ఆ రకంగా సొంత పార్టీ నాయకుల ద్వారా, అంబటిని మట్టి కరిపించడానికి సొంత పార్టీ పెద్దలే ఒక వ్యూహరచేన చేస్తుంటే గనుక.. దానిని కుట్ర అనాలి. అంటే.. తనను ఓడించడానికి తన సొంత పార్టీ వాళ్లే కుట్ర చేస్తున్నారని అంబటి బాధపడితే, ఆవేదన వ్యక్తం చేస్తే అర్థముంటుంది. అలాకాకుండా.. ప్రత్యర్థి పార్టీ తనను ఓడించడానికి వారి రాజకీయం వారు చేసుకుంటూ ఉంటే దానిని కూడా కుట్రగా పేర్కొనడం చిత్రం. తన మీద కుట్రలు జరుగుతున్నాయని చెప్పుకోవడం అనేది తన ఇమేజి గ్రాఫ్ ను పెంచడానికి ఉపయోగపడుతుందని అంబటి అనుకుంటున్నారో ఏమో మరి!
కుట్ర అనే పదానికి అర్థం తెలుసా.. అంబటీ!
Wednesday, January 22, 2025