కుటుంబ పాలన మాటెత్తే హక్కు కాంగ్రెస్‌కు ఉందా?

Wednesday, January 22, 2025

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అందరూ కలిసి హస్తినలో పార్టీ అధిష్టానంతో వ్యూహరచన కోసం సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా కీలకంగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత పరంగా అవసరమైన కార్యాచరణ ప్రణాళిక మీదనే ఈ సమావేశం ప్రధానంగా దృష్టి పెట్టింది. అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించుకున్నారు. అయితే ఈ సందర్భంగా తెలంగాణ నాయకులకు దిశా నిర్దేశం చేసే ప్రయత్నంలో భాగంగా రాహుల్ గాంధీ వారికి చెప్పిన మాటలు నవ్వు తెప్పిస్తున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ- అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి కేసీఆర్ సర్కారును మట్టికరిపించటానికి- ఒక రణన్నినాదం తయారు చేసుకుంది. అదేమిటంటే ‘‘కుటుంబ పాలన కావాలంటే భారాసకు ఓటు వేయండి.. ప్రజలపాలన కావాలంటే కాంగ్రెసుకు ఓటు వేయండి’’ అనేది. నినాదం రూపంలో చూసినప్పుడు ఇది ఎంతో అందంగానే ఉంది. అయితే వాస్తవంలో ఎంత మేరకు ప్రజలు ఈ నినాదాన్ని విశ్వసిస్తారు అనేది కీలకం. ఈ దేశంలో కుటుంబ పాలన అంటేనే- దానికి మొట్టమొదటగా చెప్పుకోవలసిన కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ! ఎన్నడో దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ముత్తాత జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా చేశారు కనుక, ఇప్పుడు దేశమంతా కలిసి తనను ప్రధాని చేయాలని ఆశపడుతున్న వ్యక్తి రాహుల్. నాలుగు తరాలుగా ప్రధాని పదవి తమకే దక్కాలని దానిని వారసత్వపు ఆస్తిగా భావిస్తున్న వ్యక్తి ఆయన! అలాంటిది కేసీఆర్- ఆయన కొడుకు కేటీఆర్ రెండో తరం అధికారాన్ని అనుభవించడం అంటే కుటుంబ పాలనగా ప్రచారం చేయమని తమ పార్టీ శ్రేణులను ప్రేరేపిస్తున్నారు.

కుటుంబ పాలన అనే పదం దిశగా కాంగ్రెస్ పార్టీ ఎవరిని వేలెత్తి చూపినాసరే తతిమ్మా నాలుగు వేళ్ళు వారికేసే చూపిస్తుంటాయనే సత్యాన్ని కాంగ్రెస్ శ్రేణులు గమనించాలి. కెసిఆర్ ను గద్దెదించటానికి వారిది కుటుంబ పాలన అని విమర్శించడం ప్రారంభిస్తే- తన వీపు మీద ఉన్న నలుపు ఎరుగని గురివింద గింజ నీతి లాగా ఉంటుందని కూడా పలువురు ఎద్దేవా చేస్తున్నారు.

అంత మాత్రమే కాదు, బిజెపి వైపు నుంచి కూడా కాంగ్రెసుకు ప్రమాదం పొంచి ఉంటుంది. ‘కుటుంబ పాలన కావాలంటే భారాసకు- ప్రజల పాలన కావాలంటే కాంగ్రెసుకు ఓటు వేయండి’ అనేదే గనుక పార్టీ నినాదం అయితే.. బిజెపి వారిని ఒక రేంజిలో ఆడుకుంటుందని మనం ఊహించవచ్చు. అటు భారాస, ఇటు కాంగ్రెస్ రెండూ కూడా ఒకే తాను ముక్కలని, కుటుంబ పాలనకు ప్రతిరూపాలని కమలదళం రెచ్చిపోయే విమర్శించే అవకాశం ఉంటుంది. కుటుంబ పాలన అనేదే దుర్మార్గం కింద ప్రొజెక్టు చేస్తూ కేసీఆర్ సర్కారును కాంగ్రెస్ నిందిస్తే.. దానిని ప్రజలు సరిగ్గా అర్థం చేసుకుంటే గనుక కాంగ్రెసుకు కూడా ఓట్లు వేయరు- అని వారు గ్రహించాల్సి ఉంది!!

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles