కిషనన్నకు ఇది కత్తిమీద సాము

Sunday, December 22, 2024

తెలంగాణ రాష్ట్ర బిజెపి సారథ్యం మార్పు గురించి చాలా రోజులుగా ప్రచారం నడుస్తూనే వచ్చింది. ఎట్టకేలకు అనూహ్యంగా తెరమీదకు వచ్చిన కిషన్ రెడ్డి మెడలో వరమాల పడింది. బండి మార్పు గురించి పుకార్లు మొదలైన నాటినుంచి.. ప్రధానంగా ఈటల రాజేందర్, డికె అరుణ తదితరుల పేర్లు ప్రబలంగా వినిపించాయి. కిషన్ రెడ్డి- బండి సంజయ్ మధ్య కుండమార్పిడిలాగా పదవుల మార్పిడి ఉంటుందనే ఊహాగానాలుకూడా మొదలయ్యాయి. సారథ్యం కిషన్ కు , కేంద్ర కేబినెట్ బండికి దక్కుతుందని అనుకున్నారు. కానీ అవేమీ నిజం కాలేదు. సారథ్యం కిషన్ కు ఇచ్చి, బండిని పూర్తిగా పక్కన పెట్టారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర బిజెపి సారథ్యం స్వీకరించడం అనేది కిషన్ రెడ్డికి కత్తిమీద సాము వంటిదే అని పలువురు విశ్లేషిస్తున్నారు. సరిగ్గా ఎన్నికలకు అయిదు నెలల ముందుగా సారథిని మార్చడం అంత గొప్ప వ్యూహం కూడా కాకపోవచ్చు. ఎందుకంటే.. బండి సంజయ్ ఒక ప్రణాళిక ప్రకారం.. ఇన్నాళ్లూ పనిచేసి ఉంటారు. నాయకులు మారినా సరే.. ఆ ప్రణాళిక, ఆ వ్యూహం ప్రకారం పార్టీ ప్రస్థానం ఉంటే ఫలితం వారు ఆశించినట్టుగా ఉంటుంది. కానీ వాతావరణం అలా లేదు.

కిషన్ రెడ్డి మీద అసలే కేసీఆర్ పట్ల సానుకూల వైఖరి ఉండే నాయకుడిగా ముద్ర ఉంది. ఆయన ఎంచక్కా కేసీఆర్ విజయానికి తెలంగాణలో మార్గం సుగమం చేస్తారని వెటకారం చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఇలాంటి అపప్రధను తొలగించుకోవడం అనేది కిషన్ రెడ్డి ముందున్న ప్రాథమిక బాధ్యత.

అదే సమయంలో కిషన్ పగ్గాలు స్వీకరించిన తరువాత.. బండి సంజయ్ తో ఇన్నాళ్లుగా విభేదిస్తున్న వారందరికీ అందలాలు దక్కుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జాతీయ కార్యవర్గ సభ్యుడు అయ్యారు. ఈటల రాజేందర్ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ సారథి అయ్యారు. ఇలా బండి వ్యతిరేకులందరినీ నెత్తిన పెట్టుకోవడం అనేది.. బండిని పూర్తిగా పార్టీకి దూరం చేసే ప్రమాదం ఉంది. అలా జరిగితే అది పార్టీకి శ్రేయస్కరం కాదు.

మరో సమస్య కూడా ఉంది. కర్ణాటక ఎన్నికల తర్వాత.. తెలంగాణలో కూడా కాంగ్రెసు వైపుచూస్తున్న వారి సంఖ్య పెరిగింది. భాజపా నాయకులు కూడా ఇంకా కాంగ్రెస్ వైపు మొగ్గుతున్న వారున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెసు కంటె బిజెపికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే నమ్మకాన్ని ఆయన అందరికీ కలిగించగలగాలి.

ఈ అన్ని అంశాలను పరిశీలించినప్పుడు.. తెలంగాణలో పార్టీకి సారథ్యం అనేది కిషన్ రెడ్డిక ఖచ్చితంగా కత్తిమీద సాము అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles