కామెడీగా మారుతున్న ‘జగనన్నకు చెబుదాం’!

Wednesday, January 22, 2025

కార్యక్రమం గురించి తొలుత ప్రకటించినప్పుడు మీకు ఏ సమస్య ఉన్నా సరే.. నేరుగా నాకే చెప్పండి, నా దృష్టికే తీసుకురండి.. నేరుగా మీ జగనన్నతోనే చెప్పుకోండి.. అంటూ జగన్ పదేపదే ఊదరగొట్టారు. రాష్ట్రంలోని ప్రజలు ఎవ్వరు ఫోన్ చేసినా స్వయంగా జగన్ ఫోన్ ఆన్సర్ చేస్తారేమో అన్నట్టుగా తొలి బిల్డప్ సాగింది. తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించే నాటికి.. ప్రజలను మభ్యపెట్టడంలో కొంత తగ్గారు. నేరుగా తాడేపల్లి కార్యాలయంలోని నా పేషీకే మీ కాల్స్ వస్తాయి. స్వయంగా నా కార్యాలయం నుంచే మానిటరింగ్ జరుగుతుంది అంటూ ప్రకటించారు. తీరా అవి కేవలం ఆపరేటర్ ఆన్సర్ చేసే కాల్ సెంటర్ కాల్స్ లాగానే మారాయి.
కాకపోతే ఈ ‘జగనన్నకు చెబుదాం’ అనే పథకంలో కాల్ చేస్తే.. తడవకోసారి మనకు వారినుంచి మెసేజీలు వస్తుంటాయి. మీ సమస్య అక్కడదాకా వెళ్లింది, ఇక్కడిదాకా వెళ్లింది అంటూ ఊదరగొట్టే మెసేజీలు వస్తుంటాయి. ఆ తర్వాత.. ఎన్నికలు ముగిసేదాకా ఆ నెంబర్ల ఫోన్లుగల వ్యక్తులను ఓ రేంజిలో వాడేసుకుంటారన్నది ఇప్పుడే ఎవ్వరికీ అర్థం కాని సంగతి. నువ్వు ఫలానా తేదీన నీ సమస్య నాకు చెప్పావు.. దాని మీద నా ప్రభుత్వం ఇలా స్పందించింది. కాబట్టి నువ్వు నాకు రుణపడి ఉండాలి. ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలి. ఇంకా పదిమందితో ఫ్యానుగుర్తుకు ఓట్లు వేయించాలి… లాంటి ప్రచారం ఏకంగా జగనన్న స్వరంతోనే వారికి పదేపదే కాల్స్ రూపంలో వచ్చే ఏర్పాట్లు చేసినా కూడా ఆశ్చర్యం లేదు.
అయితే జగనన్నకు చెబుదాం అనే వ్యవహారం మాత్రం కామెడీగా మారిపోయింది. ఎందుకంటే.. జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు స్పందన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, నేరుగా ఉన్నతాధికారులకు ప్రజలు మొరపెట్టుకునే ఏర్పాటు చాలాకాలంగా ఉంది. స్పందన పోర్టల్ ద్వారా సమస్యలు చెప్పుకునే ఏర్పాటు కూడా ఉంది. అయితే ఇంకా అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయి. స్పందన వంటి ఆ కార్యక్రమాలు జరుగుతున్న తీరును ఎగతాళి చేస్తున్నట్టుగా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘జగనన్నకు చెబుదాం’ను ప్రారంభించారు. ఇప్పుడు జగనన్నకు చెప్పుకోమని అంటున్నారంటే దాని అర్థం.. క్షేత్రస్థాయిలో వ్యవస్థలు ఏవీ ఈ ప్రభుత్వం సరిగా పనిచేయడంలేదని స్వయంగా సీఎం నమ్ముతున్నట్టేనా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో స్పందనలో చెప్పుకున్న సమస్యలనే ప్రజలు ఎవరైనా ఇప్పుడు జగనన్నకు చెప్పుకుంటే.. ఆ స్పందనలో బాధ్యులైన అధికారులు మీద కఠిన చర్యలు తీసుకుంటారా? అని కూడా ప్రశ్నిస్తున్నారు.
జగనన్నకు చెబుదాం అనేది కేవలం సమస్యల్లో ఉన్న ప్రజల డేటాబేస్ సేకరించి.. వారిని ఓట్లకోసం ఫాలోఅప్ చేయడానికి ఆడుతున్న డ్రామా తప్ప మరొకటి కాదని, ఇది రెండు రో జుల్లోనే కామెడీగా మారిపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles