చాలా కాలం నుంచి అందరూ అనుమానిస్తున్నదే నిజం అవుతోంది. ‘ఋషికొండను విచ్చలవిడిగా తవ్వేసి టూరిజం కోసం అంటూ నిర్మించిన భవనాలను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం గానే వాడుకోబోతున్నారు’ అని తేట తెల్లం అవుతోంది. ఒకవైపు రుషికొండను విధ్వంసం చేసిన భారీ నిర్మాణాలు తుది దశలో ముస్తాబు అవుతున్నాయి. ఇంటీరియర్ డిజైన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు అక్టోబర్ లో దసరా నాటికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కాపురం విశాఖపట్నం మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ రెండింటికి కచ్చితంగా ఉంది ముడి ఉంది.
విశాఖపట్నంలో ఋషికొండను ధ్వంసం చేసి కట్టిన నిర్మాణాలలోనే ముఖ్యమంత్రి కాపురం ప్రారంభించబోతున్నారు. తద్వారా విశాఖకు రాజధాని కూడా తీసుకొస్తున్నానని, ఉత్తరాంధ్ర మొత్తం తన పార్టీని నెత్తిన పెట్టుకోవాలని ఆయన ఒక సంకేతం ఇవ్వబోతున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ నివాసం శాశ్వతం కాదని, నెలలో కొన్ని వారాలు మాత్రమే విశాఖలో ఉంటూ కొన్ని వారాలు తిరిగి తాడేపల్లి ప్యాలెస్ కు కూడా వస్తుంటారని ఒక వాదన రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ‘వారంలో మూడు రోజులపాటు విశాఖలో ఉంటూ మిగిలిన రోజులు తాడేపల్లిలో జగన్ గడుపుతారని’ సమాచారం ఉందంటున్నారు. ఏదేమైనప్పటికీ దసరా నాటికిలో జగన్మోహన్ రెడ్డి కాపురం ప్రారంభించడం మాత్రం తథ్యం అని అర్థమవుతోంది.
కాపురం మాత్రమేనా, పరిపాలన కూడా విశాఖ నుంచే జరుగుతుందా? ఎగ్జిక్యూటివ్ రాజధాని కూడా విశాఖపట్నం తరలిపోతుందా? అనే సందేహాలు ప్రజల్లో ఉండడం సహజం! సుప్రీంకోర్టు తుది తీర్పు వస్తే తప్ప ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖపట్నానికి తరలించడం ప్రభుత్వానికి అసాధ్యం! అయితే నాలుగేళ్లుగా మూడు రాజధానుల పేరుతో ఊదరగొడుతున్న వైసిపి నాయకులు ఎన్నికలలోగా అలాంటి ప్రయత్నం జరగకుంటే తమను ప్రజలు నమ్మరు అని భయపడుతున్నారు. అలాగని రాజధానిని విశాఖకు తీసుకెళ్లే అధికారం వారి చేతిలో లేదు. అందుకే ముఖ్యమంత్రి మాత్రం నివాసాన్ని తాత్కాలికంగా విశాఖకు మార్చేసి త్వరలో రాజధాని కూడా రాబోతోందనే మాయమాటలతో మిగిలిన ఆరు నెలలు గడిపి ఎన్నికలను ఎదుర్కోవాలని ఆలోచిస్తున్నారు.
విశాఖపట్నంకు కాపురం మార్చడం అనేది కేవలం ఉత్తరాంధ్ర ప్రజలను మాయ చేయడానికి మాత్రమే అనే వాదన పలువురిలో వినిపిస్తోంది. ఎందుకంటే అక్కడ జగన్ ఉండబోతున్నది తన సొంత భవనం కాదు. శాశ్వతంగా ఆయన అక్కడ ఉండాలని అనుకోవడం లేదనే దానికి ఇది సంకేతం! అటు బెంగళూరు, తర్వాత హైదరాబాదు, చివరికి తాడేపల్లి లో కూడా విశాలమైన సొంత ప్యాలెస్ లను నిర్మించుకుని నివాసం ఉండే అలవాటున్న వైయస్ జగన్ విశాఖపట్నంలో అలాంటి ప్రయత్నం చేయడం లేదు. రాజధాని తరలించడం అంత ఈజీ కాదు అనే అనుమానం ఆయనకు స్వయంగా ఉన్నదని దీనిని బట్టి పలువురు విశ్లేషిస్తున్నారు. సుప్రీంకోర్టు తుది తీర్పు తర్వాత రాజధాని తరలింపు సాధ్యం కాకపోతే జగన్మోహన్ రెడ్డి టూరిజం శాఖకు చెందిన ఋషికొండ భవనాలను ఖాళీ చేసి దులుపుకొని తాడేపల్లి వెళ్ళిపోతారని, ఆయనకు ఒరిగే నష్టమేమీ ఉండదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.